పైలట్ ప్రాజెక్ట్‌కు బ్రేకులు: సంగారెడ్డిలో నత్తనడకన హెల్త్ ప్రొఫైల్!

క‌లం, మెద‌క్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (Digital Health Profile) వ్యవస్థను రూపొందించాల‌ని కాంగ్రెస్ ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. హెల్త్ ప్రొఫైల్ అమలుతో రోగుల ఆరోగ్య చరిత్ర, పరీక్షల వివరాలు, చికిత్స సమాచారం ఒకే వేదికపై అందుబాటులో ఉండి, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన , సమర్థవంతమైన వైద్య సేవలు అందించే అవ‌కాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తి వివ‌రాల‌తో డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయడానికి ముందు హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థ స‌మ‌ర్ధ‌వంతంగా అమలు చేయడానికి సంగారెడ్డి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ప్ర‌భుత్వం ఎంచుకుంది.

హెల్త్ ప్రొఫైల్ కార్డు అంటే ఏంటి?

రోగి ఆసుపత్రికి వచ్చిన మొదటి దశ నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ఓపీ, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్, ఫార్మసీ వంటి అన్ని విభాగాల్లో రోగి వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్, హెల్త్ కార్డు సిద్ధం చేసే విధంగా అవసరమైన ఐటీ సదుపాయాలు, మౌలిక వసతులు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా రోగి పూర్తి వైద్య చరిత్ర డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండటం వల్ల వైద్యులు తక్షణమే సరైన చికిత్స అందించడానికి సౌలభ్యం కలుగుతుంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న ఎన్‌సీడీ, కమ్యూనికేబుల్ డిసీజెస్, ఎంసిహెచ్, చైల్డ్ హెల్త్ సేవలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించి అవసరమైతే రిఫరల్ సిస్టమ్ ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు ఈ డిజిట‌ల్ హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయ‌డం ద్వారా పూర్తి వివ‌రాలతో డిజిట‌ల్ హెల్త్ కార్డుల రూపంలో ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌గ్ర‌ స‌మాచారం అందుబాటులో ఉంటుంది. గ‌నుక ప్ర‌భుత్వం సైతం ప్రాధ‌న్య‌త క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ అవ‌స‌రాల‌కు అనుగుణంగా చికిత్స‌, మందులు, ఇత‌ర వైద్య‌సేవ‌ల‌ను అరోగ్య శాఖ‌కు సంబంధించిన నిర్ణ‌యాల‌ను తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లా

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క నిర్వ‌హించత‌ల‌పెట్టిన‌ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిస్ట‌మ్ , డిజిట‌ల్ హెల్త్ ప్రొపైల్ కార్డు మంజూరు కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌డానికి సంగారెడ్డి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు అమలులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో (జీజీహెచ్–1, ఏరియా ఆసుపత్రులు–4, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు–5, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు–4, ప్రైమరీ హెల్త్ సెంటర్లు–31, బస్తీ దవాఖానాలు–19) సేవలు పొందేందుకు వచ్చే ప్ర‌జ‌ల స‌మ‌గ్ర అరోగ్య స‌మ‌చారంతో డిజిట‌ల్ కార్డుల‌ను అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌నర్సింహ సొంత జిల్లా కావ‌డంతో సంగారెడ్డి జిల్లాను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు పైలెట్ జిల్లాగా ఎంపిక చేశారు.హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు అమలు విధానం, ఏర్పాట్లు, అవసరమైన సాంకేతిక సదుపాయాలు ,క్షేత్ర‌స్ధాయిలో ప‌రిశీలించిన త‌ర్వాత రాష్ట్ర స్ధాయిలో అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు.

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన, అమలు పై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య అరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ ప‌లుమార్లు సమన్వయ, స‌మీక్ష సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డు అమలు కోసం సంగారెడ్డి జిల్లాలో చేపట్టే ఈ పైలెట్ ప్రాజెక్టు మార్గ‌ద‌ర్శ‌కంగా ఉండాల‌ని మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అధికారుల‌ను సూచించారు.

నత్తనడకన పైలట్ ప్రాజెక్టు

సంగారెడ్డి జిల్లాలో హెల్త్ ప్రొఫైల్‌కు సంబంధించిన ABHA ఖాతాల నమోదు సంఖ్యను పెంచేందుకు, ప్రతి రోగికి తప్పనిసరిగా ABHA ID నమోదు చేయాలి. అలాగే ప్రతి ఓపీ స్లిప్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అప్లోడ్ చేయాలని, ఫార్మసీ సేవలను కూడా డిజిటలైజ్ చేయాలని నిర్ణ‌యించారు. హెల్త్ ప్రొఫైల్ ఎంట్రీ ప్ర‌క్రియ‌ను ఈ ఏడాది మార్చి 23 న సంగారెడ్డి జిల్లాలో మొదలుపెట్టారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన‌ప్ప‌టికి ప్ర‌భుత్వ అసుపత్రులకు వ‌చ్చే ప్ర‌తి రోగి ‘ఆభా’ ఖాతాల నమోదు చేసి, వారి ఓపి స్లిప్ ,డాక్ట‌ర్ ను కల‌సిన త‌ర్వాత ఇచ్చే ప్రిస్కిష‌న్ ,ఫార్మ‌సీ మందుల వివ‌రాల‌ను ఈ – ఆరోగ్యం ,ఈ- హెచ్ఎంఐఎస్ సాప్ట్ వేర్ లో అప్ లోడ్ చేయాలి. అయితే ఈ మొత్తం ప్ర‌క్రియ వివిధ కార‌ణాల‌తో అనుకున్నంత వేగంగా ముందుకు సాగ‌డంలేదు. రోగికి సంబంధించిన ఆభా ఖాతాల నమోదు, OP రిజిస్ట్రేషన్ స‌వ్యంగా జరుగుతున్నప్పటికీ… డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, మందుల జారీ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం లేదు.

ప్రస్తుతం రోగికి సంబంధించిన హెల్త్ ప్రొపైల్ ప్ర‌క్రియ స‌జావుగా సాగ‌డం లేదు. రోగి వివ‌రాల‌ను అన్ లైన్ చేయ‌డంలో క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వం వహిస్తున్నారని అరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో రోగికి సంబంధించిన పూర్తి హెల్త్ ప్రొపైల్ సిద్ధంకాని ప‌రిస్ధితి ఏర్ప‌డింది. అంతేకాకుండా గ‌త అరు నెల‌లుగా జిల్లా వైద్య‌శాఖ‌ధికారులు ముగ్గురు మార‌డంతో … ఈ పైలెట్ ప్రాజెక్టు పైన ప‌ర్య‌వేక్ష‌ణ లేకుండా పోయింది. హెల్త్ ప్రాజెక్టును వంద శాతం పూర్తి చేయ‌డానికి కిందిస్థాయిలో సిబ్బందితో స‌మ‌న్వ‌య లోపం క‌న్పిస్తుంది. అసుప‌త్రికి చెందిన సూప‌రెంటెడ్ నుండి రోగి వివ‌రాలు ఎంట్రీ చేసే అప‌రేట‌ర్ , ఇత‌ర సిబ్బంది స‌మిష్టిగా చేస్తేనే రోగి కి స‌మ‌గ్ర హెల్త్ ప్రొపైల్ సాధ్య‌మౌతుంది. కానీ వైద్య‌ అధికారుల, డాక్ట‌ర్ల‌ ప‌ర్య‌వేక్ష‌ణ లోపం, క్షేత్ర‌స్ధాయి సిబ్బంది నిర్ల‌క్ష్యంతో ప్ర‌క్రియ స‌మ‌గ్రంగా జ‌ర‌గ‌డం లేదు.

హెల్త్ ప్రొపైల్ తీరు ఇలా

ఇప్ప‌టి వ‌ర‌కు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (GGH), ఏరియా ఆస్పత్రుల్లో 56 శాతం, అలాగే PHC, UPHC, CHC లలో 87 శాతం మంది రోగుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టును త్వ‌ర‌గా పూర్తి చేసి రాష్ట్ర‌వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని ప్రభుత్వం భావించిన అది జ‌ర‌గ‌డంలేదు. ప్రాజెక్టు మొద‌లై ఐదు నెలలు దాటుతున్న సంగారెడ్డి జిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు వివరాలు పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీ లో ఓపీ రిజిస్ట్రేషన్ 2,20,650 ఉండ‌గా ,ప్రిస్క్రిప్షన్ అప్‌లోడ్ 1,19,1977 , మెడిసిన్ జారీ 83 శాతం గా ఉంది. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి (జీజీహెచ్) లో ఓపీ రిజిస్ట్రేషన్ 1,86,795 కాగా, ప్రిస్క్రిప్షన్ అప్‌లోడ్ 1,03,541 ,మెడిసిన్ జారీ 44 శాతం గా న‌మోదైంది. పటాన్‌చెరు ఆస్పత్రి లో ఓపీ రిజిస్ట్రేషన్ 75,858, ప్రిస్క్రిప్షన్ అప్‌లోడ్ 41,437 , మెడిసిన్ జారీ 52 శాతం చేస్తున్నారు. జోగిపేట ఆస్పత్రి లో ఓపీ రిజిస్ట్రేషన్ 65,153 ,ప్రిస్క్రిప్షన్ అప్‌లోడ్ 44,847 , మెడిసిన్ జారీ 38 శాతం గా ఉంది. నారాయణఖేడ్ ఓపీ రిజిస్ట్రేషన్ 57,592 , ప్రిస్క్రిప్షన్ అప్‌లోడ్ 44,118 ,మెడిసిన్ జారీ కేవలం 18 శాతం గా ఉంది. జహీరాబాద్ అసుప‌త్రిలో ఓపీ రిజిస్ట్రేషన్ 81,992 అవ్వ‌గా , ప్రిస్క్రిప్షన్ అప్‌లోడ్ 27,495 అవుతూ, మెడిసిన్ జారీ 24 శాతంగా ఉంది. మొత్తంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓపీ రిజిస్ట్రేషన్ 4,67,390 కాగా, ప్రిస్క్రిప్షన్ అప్‌లోడ్ 2,61,438 అవుతున్నాయి. మెడిసిన్ జారీ 38 శాతం అవుతుంది.

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలు ద్వారా రోగుల ఆరోగ్య చరిత్ర, పరీక్షల వివరాలు, చికిత్స సమాచారం అన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉండి, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ఇది ఎంతో దోహదపడే అవకాశం ఉన్న అల‌స్యం కార‌ణంగా ప్ర‌భుత్వ ల‌క్ష్యం నీరుగారుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>