కలం, కరీంనగర్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ పూర్తిగా స్వార్థ రాజకీయ కోణంలోనే జరుగుతుందని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు (Boinpally Praveen Rao) ఆరోపించారు. ఆదివారం రోజున శంకరపట్నం బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ శ్రేణులతో కలిసి ప్రవీణ్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయబోయే స్మార్ట్ రేషన్ కార్డులపై దేశ ప్రధాని ఫోటోను కూడా విధిగా ముద్రించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని పక్కనపెట్టి, కేవలం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో రేషన్ బియ్యాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ సర్కార్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యంలో సింహభాగం (5 కిలోలు) కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోందని, అలాంటప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వం తమ సీఎం, మంత్రుల ఫోటోలు మాత్రమే వేసుకోవడం సరికాదన్నారు. కేంద్రం అందిస్తున్న బియ్యాన్ని తామే పూర్తిగా ఇస్తున్నట్లుగా ప్రజల్లో భ్రమలు కల్పించి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు.
రేషన్, సంక్షేమ కార్డుల విషయంలో అనవసర రాజకీయాలు చేయాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రవీణ్ రావు (Boinpally Praveen) హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, సీనియర్ నాయకులు దొంగల రాములు, దాసారపు నరేందర్, కొయ్యడ అశోక్, నిమ్మచెట్టి సంపత్, రాసమల్ల శ్రీనివాస్, చెర్ల శ్రీనివాస్, కనకం సాగర్, బిజిలి సారయ్య, కనకం కుమార్, గూళ్ల రాజు, వడ్లకొండ రాజేందర్, మొలుగూరి ప్రశాంత్, మెడిశెట్టి రాజేష్, గొల్లపల్లి వెంకటేష్, బొంతల రవి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Also Read : ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు: ఎంపీ చామల
Follow Us On: X(Twitter)

