కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda ) జిల్లా రాజకీయం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనగర్ కాలనీలోని క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణులు మెరుపు దాడికి దిగాయి. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడిని నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ఈ ఆందోళన చివరకు తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారితీసింది. మంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
నిరసన సందర్భంగా కార్యాలయం వద్ద ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ కటౌట్‌ను తగలబెట్టారు. అంతటితో ఆగకుండా క్యాంప్ ఆఫీస్‌పైకి కోడిగుడ్లు, టమాటాలు విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, 25వ వార్డు కార్పొరేటర్ రాఖీ అనుచరులతో పాటు పెద్దఎత్తున మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు పోలీసుల బలగాలను వాడుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ఆఫీసులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ధ్వజమెత్తారు. తమ కార్యకర్తల సహనాన్ని బలహీనతగా భావిస్తే ఊరుకునేది లేదని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఆగ్రహం.. బీజేపీ ఆఫీస్ వైపు ప్రదర్శన
మంత్రి నివాస ప్రాంగణంపై దాడికి దిగడంపై కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొనే శక్తిలేకనే బీజేపీ నాయకులు ఇలాంటి చౌకబారు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఘటనకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు కూడా నల్లగొండలోని బీజేపీ జిల్లా కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు సిద్ధమవ్వడంతో నగరంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. మంత్రి ఇంటిపై దాడి ఘటన సమాచారం అందుకున్న వెంటనే నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తీవ్రంగా స్పందించారు.
పరిణామాలు చేయిదాటిపోకుండా పట్టణంలోని గడియారం సెంటర్, ఇందిరా భవన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. దాడిలో పాల్గొని అత్యుత్సాహం ప్రదర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో పాటు ఆయన అనుచరులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు వేగవంతం చేశాయి. ప్రస్తుతం నల్లగొండ పట్టణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు పగడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

