కరీంనగర్ గడ్డపై కాషాయ కదనం.. గులాబీ సమరం!

కలం, కరీంనగర్ బ్యూరో : ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువైన కరీంనగర్ జిల్లా మరోసారి వేదికగా మారింది. వారం రోజుల వ్యవధిలోనే రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ (BJP vs BRS) భారీ బల ప్రదర్శనలకు సిద్ధమవుతుండటం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈనెల 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహా పాదయాత్ర, 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీక్షా దివస్ భారీ బహిరంగ సభలతో జిల్లాలో ఒక్కసారిగా పొలిటికల్ హీటెక్కింది. ఇరు పార్టీల ప్రధాన లక్ష్యం అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమేనని అనిపిస్తున్నా కానీ.. అంతర్గతంగా మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అసలైన ప్రత్యామ్నాయం ఎవరు? అనే ఆధిపత్య పోరు ఆయా పార్టీల తీరును బట్టి స్పష్టంగా కనిపిస్తున్నది. వారం రోజుల వ్యవధిలో రెండు భారీ రాజకీయ సమీకరణలతో కరీంనగర్ జిల్లా పూర్తిగా ఎన్నికల వాతావరణాన్నితలపిస్తున్నది.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రమంత్రి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు పర్యటనకు వస్తుండగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కనీసం 50 వేల నుండి లక్ష మంది వరకు జనసమీకరణ చేయాలని బండి సంజయ్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాంతాన్ని బీజేపీకి కంచుకోటగా మార్చడమే కాకుండా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కరీంనగర్ నుండే శంఖారావం పూరిస్తు న్నారు. జాతీయ అధ్యక్షుడు వస్తుండటంతో దేశవ్యాప్తంగా చేపట్టిన 40 భారీ ర్యాలీల్లో కరీంనగర్‌ను ఎంచుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందనేది ఆ పార్టీ నేతల్లో చర్చగా జరుగుతున్నది.

నబీన్ పర్యటన షెడ్యూల్ లో భాగంగా హైదరాబాద్ చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో పాదయాత్ర రోజు మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ కు చేరుకుంటారు. అనంతరం కరీంనగర్ వైశ్యా భవన్ (కార్ఖానాగడ్డ గాంధీ బొమ్మ చౌరస్తా)నుంచి మహా పాదయాత్రను ప్రారంభించనుండగా.. సుమారు కిలోమీటరున్నర కొనసాగనుంది. బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్.రామచంద్రరావు, కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఇన్ చార్జ్ సునీల్ బన్సల్, సహ ఇన్ చార్జ్ లు రేఖా శర్మ, అభయ్ పాటిల్ వంటి అగ్రనేతలు పాల్గొంటారు. “ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకత్వాన్ని పాతరేద్దాం” నినాదంతో యాత్రను నిర్వహిస్తూ ‘సర్’పై ఇండియా కూటమి, కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించడమే లక్ష్యమని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

ఉద్యమ సెంటిమెంట్‌తో గులాబీ కదనభేరి

మరోవైపు రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా దీక్షా దివస్ ను ఈసారి కరీంనగర్ జిల్లా అలుగునూరు వేదికగా భారీ బహిరంగ సభ ద్వారా నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం బిజీ అయింది. ఈ నెల 29న నిర్వహించే సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గులాబీ దళానికి మళ్లీ జవసత్వాలు నింపేందుకు కేటీఆర్ ఉద్యమ సెంటిమెంట్‌ను అస్త్రంగా చేసుకోనున్నారు.

2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తూ అరెస్టయిన అలుగునూరు చౌరస్తానే ఇప్పుడు సభా వేదికగా ఎంచుకోవడం వెనుక ప్రజల్లో మరోసారి భావోద్వేగాన్ని రగిలించే వ్యూహం ఉన్నట్టు తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని 8 సెగ్మెంట్లకు చెందిన నేతలందరి నీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సంస్మరణ సభ మాత్రమే కాకుండా రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలకు కేడర్ ను ఇప్పటినుంచే సిద్ధం చేసేందుకు రిహార్సల్ గా తీసుకోనున్నది.

ఇరు పార్టీల ఉమ్మడి టార్గెట్ కాంగ్రెస్ సర్కార్

రాష్ట్రంలో మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై రైతులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పోటీ (BJP vs BRS) పడుతున్నాయి. జాతీయ నాయకత్వం అండతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుంచి పొలిటికల్ స్ట్రైక్ ద్వారా వ్యూహాలు పన్నుతున్నారు. స్వ రాష్ట్ర సాధన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేస్తూ కేటీఆర్ ఓటు బ్యాంకును తిరిగి ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల హోరాహోరీ బలప్రదర్శనల మధ్య అధికార కాంగ్రెస్ కరీంనగర్‌లో ఏ విధంగా ప్రతివ్యూహం పన్నుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>