కలం, మెదక్ బ్యూరో: బీజేపీ (BJP) పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణే పార్టీకి బలం అని బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ (Chandrashekhar) అన్నారు. బీజేపీ సంగారెడ్డి (Sangareddy) జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి (Godavari Anji Reddy) అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అఖండ భారత నిర్మాణమే ధ్యేయంగా పనిచేసే ఒక సిద్ధాంతాల పునాది అని స్పష్టం చేశారు. శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయల కాలం నుండి నేటి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వరకు పార్టీ ఎదుగుదలను, సాధించిన విజయాలను ఆయన వివరించారు.
కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, క్రమశిక్షణ, నిరంతర ప్రజలకు అందుబాటులో ఉండటం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ శిక్షణా తరగతుల ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపి, రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి పాల్గొన్నారు.

