Mobile Popup Ad
Mobile Popup Ad

త్యాగానికి, మానవత్వానికి ప్రతీక బక్రీద్: మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డు ఈద్గాలో బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ముఖ్య అతిథిగా పాల్గొని, ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర ముస్లింలందరికీ హృదయపూర్వక బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు, అది మానవాళికి ఒక గొప్ప జీవన సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. “అల్లా పట్ల ఉన్న అపారమైన విశ్వాసాన్ని, ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం గొప్ప త్యాగ నిరతిని చాటిచెప్పే పవిత్రమైన రోజు ఇది. తనకు అత్యంత ప్రియమైనదాన్ని సైతం దేవుని కోసం త్యాగం చేయడానికి సిద్ధపడటమే నిజమైన భక్తి. మన స్వార్థాన్ని, అహాన్ని వదిలేసి, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటమే ఈ పండుగ వెనుక ఉన్న అసలు సందేశం. మనకున్న దాంట్లో లేనివారికి పెట్టడం, పేదలను ఆదుకోవడం బక్రీద్ ముఖ్య ఉద్దేశం” అని మంత్రి అన్నారు.

సెక్యులరిజానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది..

నల్లగొండలో గంగా-జమునా తెహజీబ్ (మతసామరస్యం) వర్ధిల్లుతోందని మంత్రి కొనియాడారు. గత 30 ఏళ్లుగా నల్లగొండలో ఏ ఒక్క చిన్న అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా హిందూ, ముస్లిం సోదరులు అందరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకుంటున్నారని, ఈ ఐక్యత, సోదరభావం ఎల్లకాలం ఇలాగే వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ లౌకికత్వానికి (సెక్యులరిజం) కట్టుబడి ఉందనడానికి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లే నిదర్శనమని, దీనివల్ల ఎంతోమందికి విద్యా, ఉద్యోగ అవకాశాలు లభించాయని గుర్తుచేశారు. అలాగే, దేశంలో అన్ని వర్గాలు, మతాల ప్రజలు కలిసికట్టుగా ఉండాలనే గొప్ప సందేశంతోనే రాహుల్ గాంధీ గారు రాజకీయాలకు అతీతంగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ‘భారత్ జోడో’ యాత్ర చేపట్టారని మంత్రి వివరించారు.

ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కృషి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, వారి ముఖాల్లో సంతోషం చూడటానికే కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మైనారిటీలు విద్యా, ఉపాధి రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆధునిక పాఠశాలలను నిర్మిస్తోందని, అలాగే నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. స్థానిక ముస్లిం సోదరుల విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. నల్లగొండలో షాదిఖానా ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలోనే ల్యాండ్ (స్థలం) అలాట్ చేయడం జరిగిందని, త్వరలోనే అన్ని హంగులతో దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, ఆ అల్లాహ్ కరుణాకటాక్షాలు తెలంగాణ రాష్ట్రంపై, ప్రజలపై ఎల్లప్పుడూ ఉండి అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>