Mobile Popup Ad
Mobile Popup Ad

పెద్ద దిక్కు ఎక్కడా..? సమస్యల్లో సంగారెడ్డి బీజేపీ

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా బీజేపీ (Sangareddy BJP) ప‌రిస్ధితి పైన ప‌టారం .. లోన లొటారం అన్న చందంగా త‌యారైంది. పేరుకే దేశాన్ని ఏలుతున్న పార్టీ అయిన‌ప్ప‌టికీ.. జిల్లాలోని ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప‌ట్టించుకున్న నాధుడే లేడు. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ త‌రుఫున పోటిచేసిన నాయ‌కులు కొంద‌రు పార్టీ మారిపోయారు.. మ‌రికొంద‌రు సైలెంట్ అయ్యారు. దీంతో సంగారెడ్డి జిల్లాలో బీజేపీ ప‌రిస్ధితి రోజు రోజు కు బ‌ల‌హీనంగా మారుతుంది.

అసెంబ్లీ అభ్య‌ర్థులు అవుట్..

సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, ప‌టాన్ చెరు, జ‌హీరాబాద్, అందోల్, నారాయ‌ణ ఖేడ్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 2023 ఎన్నికల్లో సంగారెడ్డి నుండి అప్పుడే బీఆర్ఎస్ పార్టీ నుండి వ‌చ్చిన పులిమామిడి రాజుకు బీజేపీ నుండి టికెట్ ఇచ్చారు . ఆయ‌న ఎన్నికల్లో ఓడిపోయిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అదే విధంగా బీజేపీ టికెట్ కోసం మాత్ర‌మే జ‌హీరాబాద్ అసెంబ్లీ నుండి మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ త‌మ్ముడు రాంచంద‌ర్ రాజ‌న‌ర్సింహ బీజేపీ లోకి వ‌చ్చి , ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ కి దూరంగా ఉంటున్నారు. అందోల్ నియోజ‌క‌వ‌ర్గం నుండి సినీ న‌టుడు, మాజీ మంత్రి బాబు మోహ‌న్ బీజేపీ త‌రఫున బ‌రిలో నిలిచి ఓడిపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. నార‌య‌ణ ఖేడ్ నియోజ‌క‌వ‌ర్గం నుండి జ‌ర్న‌లిస్టుగా ఉన్న జ‌న‌వాడే సంగ‌ప్పకు బీ ఫాం ఇచ్చింది బీజేపీ అధిష్టానం.

అయితే, ఆయన నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చింది లేదు.. పార్టీ ప‌రిస్ధితిని ప‌ట్టించుకున్న‌ది లేదు. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం నుండి మాజీ ఎమ్మెల్యే నందీశ్వ‌ర్ పోటీ చేసి ఓట‌మి చ‌వి చూశారు. 2023 ఎన్నిక‌ల త‌ర్వాత నందీశ్వ‌ర్ గౌడ్ పూర్తిగా కాషాయం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇలా సంగారెడ్డి జిల్లాలో 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ పోటీ చేసిన బాబుమోహ‌న్, పులిమామిడి, రాంచంద‌ర్ రాజ‌న‌ర్సింహ పార్టీకి రాజీనామా చేయ‌గా, సంగ‌ప్ప, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ నియోజకవర్గ కార్య‌క‌ర్త‌లుకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ ఒక్క ప్రాంతంలో కూడా కాషాయం పార్టీ త‌రుఫున బాధ్యత తీసుకునే వారే క‌రువయ్యారు. ఏదైనా ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మం చేయ‌ల‌న్నా.. లేక బీజేపీ కి సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలన్నా నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్య‌క‌ర్త‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకునే నాయ‌కుడే లేని ప‌రిస్ధితి ఉన్న‌ది.

అవ‌కాశం ఉన్న.. చిత్తశుద్ధి లేదు!

నిజానికి సంగారెడ్డి జిల్లా భౌగోళికంగా, స్వ‌భావ రీత్య బీజేపీ కి అనుకూలంగా ఉండే ప్రాంత‌మ‌నే చెప్పాలి. క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులోని జహీరాబాద్, నారాయణ ఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో క‌ర్ణాట‌క త‌ర‌హాలోనే సంస్కృతి, సంప్ర‌దాయ‌ల‌కు పాటించ‌డంతో పాటు స్వామిజీలు, అప్ప‌లు, అశ్ర‌మాలు ఉంటాయి. దీంతో హిందూ ఓట్ల పొల‌రైష‌న్‌కు అవ‌కాశం ఉన్న స‌రైన ప్ర‌ణాళిక‌, బాధ్యత గ‌త నాయ‌క‌త్వం లేక‌పోవ‌డంతో బీజేపీ నామ‌మాత్రంగా మిగిలిపోయిందనే చెప్పాలి. ఇక సంగారెడ్డి, ప‌టాన్ చెరువు నియోజ‌క‌వ‌ర్గాలు హైద‌రాబాద్ ద‌గ్గ‌ర‌గా ఉండి దాదాపు ప‌ట్ట‌ణ జ‌నాభ అత్య‌ధికంగా ఉటుంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కుడా ప‌ట్ట‌ణ ఓట‌ర్లు, నార్త్ ఇండియా జనం ఎక్కువ‌గా ఉండ‌టంతో బీజేపీకి క‌లిసివ‌చ్చే అవ‌కాశం.

అయితే, నాయ‌క‌త్వలేమి.. కమలం పార్టీ ఎదుగుద‌ల‌కు ప్ర‌తిబంధ‌కంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో పార్టీబ‌ల‌ప‌డడానికి అవ‌కాశం ఉన్నా స‌రైన నాయ‌కత్వం లేకపొవ‌డంతో రోజురోజుల‌కు పార్టీకి ఆదరణ త‌గ్గుతోంది. స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌తో పాటు, మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో సంగారెడ్డి జిల్లాలో కాషాయం పార్టీ గ‌తంలో ఉన్న‌ ఉనికిని, సీట్లను సాధించ‌లేక‌పోయింది. నిజానికి బ‌ల‌మైన అభ్య‌ర్ధులు ఉన్న సమయంలో ప్రజలు బీజేపీకి ప‌ట్టం క‌ట్టారు. మెద‌క్ పార్ల‌మెంట్ స్థానంలో బీజేపీ నుండి ర‌ఘ‌నంద‌న్ రావు గెలిచారు. అదే విధంగా పట్టభ‌ద్రుల ఎమ్మెల్సీగా సంగారెడ్డి జిల్లాకు చెందిన అంజిరెడ్డి కమలం పార్టీ నుండి విజ‌యం సాధించారు.

ప‌ట్టించుకోని బీజేపీ అధిష్టానం..!

2023 అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసి దాదాపు రెండున్నరేళ్లు కావ‌స్తున్న సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీల‌ను నియామించ‌లేదు. అస‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కమలం పార్టీకి పెద్ద‌దిక్కులేక ఏళ్లు గడుస్తున్నా ప‌ట్టించుకున్న నాధుడేలేడు. పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం కుడా సంగారెడ్డి జిల్లాలో బీజేపీ (BJP) పార్టీ ప‌రిస్ధితుల‌ను చ‌క్క‌దిద్ది బ‌లోపేతం చేసే క‌నీస ప్ర‌య‌త్నం చేయ‌లేదు. దీంతో స్థానిక నాయ‌క‌త్వం లేక, అధిష్టానం పట్టించుకోక‌ కాషాయ పార్టీ పరిస్థితి నాన‌టికి దిగ‌జారిపోతుంది. కార్య‌క‌ర్త‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసేవారు లేక‌పొవ‌డంతో పార్టీ కార్య‌క్ర‌మాల సైతం మొక్కుబ‌డిగా నిర్వ‌హిస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నా… స్థానికంగా కేంద్ర ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌లేక‌పోతున్నారు. అంతేకాకుండా పార్టీలో ఉన్న నాయకుల మ‌ధ్య కుడా స‌మ‌న్వ‌యం లేక‌పొవ‌డంతో గ్రూపు త‌గ‌దాలు త‌రుచుగా జ‌రుగుతున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లా అధ్య‌క్షురాలు గోదావ‌రి అంజిరెడ్డి తో ప‌లువురు నాయ‌కుల‌కు పొస‌గ‌డం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ బ‌తోపేతం చేయ‌డం క‌ష్టంగా మారింది. పార్టీని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌లు మాత్రం తీవ్ర అసంత్ర‌ప్తిగా ఉన్నారు. స్థానికంగా త‌మ‌కు దిశ‌నిర్ధేశం చేసేవారు, స‌మ‌న్వ‌యం చేసేవారు లేక రాజ‌కీయంగా న‌ష్ట‌పోతున్న‌మ‌ని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా బీజేపీ అధిష్టానం సంగారెడ్డి జిల్లా పైన దృష్టి పెట్టి, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీల నియమించి.. పార్టీని బ‌లోపేతం చేసి, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి న్యాయం చేయాల‌ని కార్యకర్తలు కొరుతున్నారు.

Read Also: చినబొయినపల్లిలో విద్యా విప్లవం.. ప్రభుత్వ పాఠశాలలో 103 అడ్మిషన్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>