అటెన్షన్ డైవర్షన్‌లో బీజేపీ సక్సెస్.. పార్టీలన్నీ బిల్లుల బాటలో..

కలం, నేషనల్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను తెరమీదకు తేవడంతో దేశంలో ఎల్పీజీ సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఓటర్ల జాబితా సవరణలో అనుమానాలు… ఇవన్నీ పక్కకు పోయాయి. అన్ని పార్టీల దృష్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు బిల్లులపైనే ఫోకస్ అయింది. ఇటీవల ముగిసిన పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు సైతం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో జరగలేదు. ప్రభుత్వ బిల్లులపై చర్చ, ఆమోదం బీజేపీ (BJP) అనుకున్నట్లుగా జరిగినా విపక్షాలు లేవనెత్తిన అంశాలపై మాత్రం ఏకాభిప్రాయం కుదరక పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణల బిల్లు, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కోసం డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడంతో పాటు వారిని ఎన్నుకోడానికి అనుసరించాల్సిన విధానం.. వీటిని రేపటి (ఏప్రిల్16) నుంచి చర్చ జరపనుండడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి వీటిపైనే కేంద్రీకృతమైంది. పార్టీల అటెన్షన్‌ను డైవర్ట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది.

బడ్జెట్ సమావేశాల్లోని అంశాలన్నీ పక్కకు:

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా పలు విపక్షాలు అమెరికా-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం, ముడిచమురు దిగుమతిపైన పడిన ప్రభావం, ఎల్పీజీ ధరల పెరుగుదల, కమర్షియల్ సిలిండర్ల కొరత, విదేశాంగ విధానం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన, ఉపాధి హామీ పథకం చట్టానికి మార్పులతో మహాత్మాగాంధీ పేరు తొలగిపోవడం, రాష్ట్రాలపై ఆర్థిక భారం పడడం.. వీటన్నింటినీ లేవనెత్తాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. వాకౌట్‌లు, సస్పెన్షన్‌లతో సభా సమావేశాలు గందరగోళంగా మారాయి. ప్రభుత్వం అనుకున్న బిల్లులన్నీ గాడిన పడినప్పటికీ ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రజా సంబంధ అంశాలపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. సమావేశాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఇప్పుడు మూడు రోజుల పాటు ప్రత్యేక సెషన్‌ షెడ్యూలు ఖరారైంది.

బీజేపీ పొలిటికల్ ఉచ్చులో విపక్షాలు:

చట్టసభల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్ కల్పించడం, లోక్‌సభతో పాటు శాసనసభ స్థానాల సంఖ్యను పెంచేలా డీలిమిటేషన్ బిల్లులను తెరమీదకు తేవడంతో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో అలజడి మొదలైంది. సౌత్ వర్సెస్ నార్త్ స్టేట్స్ వివాదంగా మారింది. దక్షిణాది రాష్ట్రాలకు శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని, ఎక్కువ సీట్లు ఉత్తరాది రాష్ట్రాల్లో పెరగడం ద్వారా సహకార సమాఖ్య స్ఫూర్తి సమాధి అవుతుందన్నది కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్, వామపక్ష పార్టీల వాదన. అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి డీలిమిటేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం ఏ విధంగా చేయాలనుకుంటున్నదో చర్చించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఈ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటివరకూ లేవనెత్తిన అంశాలన్నీ ఈ పార్టీలకు అప్రాధాన్యమైపోయాయి. పకడ్బందీ ప్లాన్‌తో బీజేపీ పన్నిన ఉచ్చులో అన్ని రాజకీయ పార్టీలు ఇరుక్కున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>