కలం, వెబ్ డెస్క్: శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువతను లాఠీలతో కొడుతారా.. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఇష్టమొచ్చినట్లు ఈడ్చి పారేశారని, తీవ్రంగా కొట్టారని ధ్వజమెత్తారు.
దీనిపై ఇంతవరకు ప్రధాని మోదీ స్పందించనే లేదని విమర్శించారు. పార్లమెంటులో ఈ అంశంపై చర్చించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరామని.. ఆయన సుముఖంగానే ఉన్నా, ప్రభుత్వం నుంచి అనుమతి కావాలని చెప్పినట్లు వివరించారు.
రాజీనామా చేయాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తోందని.. పరీక్షల విధానాన్ని కూడా భ్రష్టు పట్టించిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అందుకోసమే యువత ఆందోళనలు చేస్తున్నారని వివరించారు. ఈ దేశ యువతకు ఉన్న ఒకే ఒక్క ఆధారం పోటీ పరీక్షలు మాత్రమేనని.. అక్కడ కూడా అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని.. అవసరమైతే ప్రధాని, హోం మంత్రి కూడా తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

