Mobile Popup Ad
Mobile Popup Ad

పోలవరంతో భద్రాచలానికి ప్రమాదం.. ఎమ్మెల్యేల ఆందోళన

​కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని, శ్రీ రాముడి కొలువైన భద్రాచలం పుణ్యక్షేత్రం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఓ వైపు వర్షాకాలం సమీపిస్తుండటం, మరో వైపు పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పూర్తి కావొస్తుండటంతో.. బ్యాక్ వాటర్ రూపంలో భద్రాచలం, బూర్గంపాడు పట్టణాల మనుగడకే ముప్పు పొంచి ఉందని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు వరదలు వచ్చినప్పుడు మాత్రమే మునిగే భద్రాచలం, పోలవరం నిర్మాణం పూర్తయితే ఏడాది పొడవునా జలదిగ్బంధంలోనే ఉండాల్సి వస్తుందనే విశ్లేషణలు స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ​ఈ భౌగోళిక ముప్పుపై పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు తీవ్రతను అంచనా వేయడానికి రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ సంజీవ్ నందన్ సహాయ్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉన్నతాధికారులను కలిసి క్షేత్రస్థాయి వాస్తవాలను వారికి వివరించారు.

కరకట్టల పునాదులు బలహీనం..

గోదావరి నదిలో నిరంతరం అధిక మొత్తంలో నీరు నిలిచి ఉండటం వలన భద్రాచలాన్ని రక్షిస్తున్న కరకట్టల పునాదులు నిరంతరం నానుతూ బలహీన పడే అవకాశం ఉంది. ఈ బ్యాక్ వాటర్ ముప్పు కేవలం నది ఒడ్డుకే పరిమితం కాకుండా పట్టణాన్ని లోపలి నుంచే ముంచెత్తేలా చేసే అవకాశం ఉంది. భద్రాచలం పట్టణంలోని మురుగునీరు, వరద నదిలోకి వెళ్లేందుకు ఎనిమిది ప్రధాన తూములు ఉన్నాయి. నదిలో నీటి మట్టం ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండటం వల్ల ఈ తూములు సహజంగానే మూసుకుపోతాయి. ఫలితంగా స్వల్ప వర్షాలకే మురుగునీరు వెనక్కి తన్ని పట్టణ లోపలి నుంచే మునిగిపోయే ప్రమాదం ఉంది. 1986లో 75.6 అడుగులు, 2022లో 71 అడుగుల మేర నమోదైన చారిత్రక మహా ప్రళయాలు తాత్కాలికంగా వచ్చి వెళ్లినవే అయినా లోతట్టు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి.

వాగుల నీరు వెనక్కి..

గోదావరి ఉప నదులైన కిన్నెరసాని, ముర్రేడు, తురుబాక, ఏడుల వాగు, పెద్దవాగుల సహజ నీటి పారుదల మార్గాలపై కూడా ఈ బ్యాక్ వాటర్ తీవ్ర ప్రభావం చూపనుంది. నది నిండుగా ఉండటం వల్ల ఈ వాగుల నీరు నదిలోకి వెళ్లకుండా నీటి ఎగపోటు ఏర్పడి బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లోని వ్యవసాయ భూములు, గ్రామాలు శాశ్వతంగా ముంపునకు గురవుతాయి. ముఖ్యంగా అశ్వాపురంలోని దేశ రక్షణ, ఇంధన రంగాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘హెవీ వాటర్ ప్లాంట్’ భద్రతకు కూడా భవిష్యత్తులో ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముంపు చాలా ఎక్కువే: పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే

‘అధికారిక లెక్కల కంటే వాస్తవ పరిస్థితుల్లో ముంపు విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంది. పోలవరం బ్యాక్‌ వాటర్ వలన నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం గ్రామాలు, వందలాది కుటుంబాలు నిర్వాసితులయ్యే ప్రమాదం ఉంది. నేను పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులకు పది ప్రధాన డిమాండ్ల వినతిపత్రం సమర్పించాను. తక్షణమే ప్రభావిత గ్రామాల్లో సమగ్ర శాస్త్రీయ బ్యాక్‌వాటర్ సర్వే నిర్వహించాలి. ప్రత్యేక పునరావాస ప్యాకేజీతో పాటు రక్షణ కరకట్టలు, ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించాలి. అలాగే ప్రజాప్రతినిధులు, నిపుణులతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరపాలి.’

శాశ్వత పరిష్కారం కావాలి: తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే

‘ఏటా వరదల వలన భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజలు నిరాశ్రయులవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. ఇందుకోసమే నేను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓను నేరుగా కలిసి సుదీర్ఘంగా చర్చించాను. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి. భద్రాచలం పట్టణాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను వరదల నుంచి శాశ్వతంగా రక్షించేందుకు కరకట్టల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశాను.’

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>