కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి (Yadagirigutta) ఆలయం షాపుల విషయంలో కొందరు వ్యాపారస్తులు చేస్తున్న దోపిడీని అరికట్టాలని, తక్షణమే బహిరంగ టెండర్లు నిర్వహించాలని పట్టణ బీజేపీ (BJP) నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు వర్తక సంఘం తీరుపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ.. కొందరు వ్యాపారస్తులు 60 ఏళ్లుగా షాపులను తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ దేవస్థానం ఆదాయానికి గండికొడుతున్నారని విమర్శించారు. తమను తాము పేదవారిగా చెప్పుకుంటూనే ఏటా లక్షల్లో ఐటీ కడుతున్నారని, ఇది సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
కొబ్బరికాయలను రూ. 100కు, నీళ్ల బాటిళ్లను రూ. 40కు అమ్ముతూ భక్తుల జేబులు కత్తిరిస్తున్నారని ఆరోపించారు. దేవస్థానం అధికారుల అండదండలతోనే షాపుల సబ్ లీజులు, అమ్మకాలు సాగుతున్నాయని మండిపడ్డారు. వేలాది మంది నిరుద్యోగులు తక్కువ జీతాల కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుంటే, కొందరు మాత్రం దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. పేరుకు 10 షాపులని చెబుతూ సుమారు 20 షాపులు నిర్వహిస్తున్నారని, కొండ కింద వందల కోట్లతో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ఎందుకు నిరుపయోగంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. షాపుల నిర్వహణకు తక్షణమే పారదర్శకమైన టెండర్లు నిర్వహించాలన్నారు. స్థానిక రిజర్వేషన్ ప్రకారం.. కోట కింద ఉన్న వారికి 70 శాతం షాపులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం టెండర్లు వేయకపోతే, జూన్ 1న నిరుద్యోగులతో కలిసి కొండపై కొబ్బరికాయలు, పూలు, పండ్లు అమ్ముకుంటామని ప్రకటించారు. ఈ సమావేశంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్, మండల మాజీ అధ్యక్షుడు గుంటిపల్లి సత్యం, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి, పట్టణ కార్యదర్శులు కర్ణ, సత్యనారాయణ, కోశాధికారి వీరేశ్, సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, మిర్యాల కృష్ణ, ఆకుల దేవేందర్, వంశీ పాల్గొన్నారు.

