కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా అకాల వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపించగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి ఆకాశం మబ్బులతో మేఘావృతమైంది. చిరుజల్లులతో మొదలుకొని ఈదురుగాలులతో భారీ వర్షాలు (Heavy Rains) బీభత్సం సృష్టించాయి. రాష్టంలోని నల్గొండ, మంచిర్యాల, సూర్యాపేట, సిద్ధిపేట, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సూర్యాపేటలో ఈదురుగాలులతో వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మార్కెట్ యార్డులో ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయింది. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్‌లో భారీ వర్షం ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది.
ఉమ్మడి వరంగల్, ములుగు, ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నేరేడుచర్ల, త్రిపురాంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆరుగాలం కస్టపడి పండించిన ధాన్యం అకాలవర్షానికి తడిసిపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఈదురు గాలులతో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షం కురిసింది. భారీ వర్షాల ధాటికి నల్గొండ పట్టణంలో హోర్డింగులు గాలికి విరిగిపోయాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలో భారీ చెట్లు నేలకొరిగాయి. చేతికొచ్చే పంట నేలపాలు అవడంతో రైతన్నలు, మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Read Also: తెలంగాణ టెంపుల్ టూరిజం : మన గుడులు.. మన సంస్కృతి
Follow Us On : WhatsApp

