కలం, వెబ్ డెస్క్: పెరూ దేశంలో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) చోటు చేసుకుంది. ఇకా నుంచి నాజ్కా లైన్స్‌కు వెళ్తున్న చిన్న విమానం కుప్పకూలిపోవడంతో 13 మంది మరణించారు. వీరిలో 11 మంది పర్యాటకులు కాగా, ఇద్దరు పైలట్లు ఉన్నారు. అందరూ చనిపోయినట్లు పెరూ రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఘటన జరిగిన ప్రాంతానికి సహాయక సిబ్బంది చేరుకున్నారని.. మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. పర్యాటకులు స్పెయిన్, ఇటలీ, జర్మనీ దేశాలకు చెందినవారుగా గుర్తించారు.
ఎడారి ప్రాంతంలో కూలిపోయి..
ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాజ్కా లైన్స్ చూసేందుకు పర్యాటకులతో కూడిన ప్రైవేట్ విమానం ఇకా ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరింది. నాజ్కా లైన్స్ నగర సమీపానికి సమీపంలోని ఎడారి ప్రాంతానికి వచ్చేసరికి ఏటీసీతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కొద్దిసేపటికే కుప్పకూలిపోయి, భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పెరూ ప్రభుత్వం వెల్లడించింది. వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తోంది.

