కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. వ్యాపార భాగస్వామ్యం పేరుతో ఒక ప్రవాస భారతీయుడిని నమ్మించి కోట్లాది రూపాయలు కాజేసిన ఉదంతం కలకలం రేపుతోంది. నిజాంపేట ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐ పవన్ కుమార్ ఈ మోసానికి గురయ్యారు. బీజేపీ నాయకుడు గజ్జల యోగానంద్ (Gajjala Yoganand) తన కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని పవన్ కుమార్‌ను నమ్మించారు. పాత పరిచయం ఉండటంతో ఆయన మాటలు నమ్మిన బాధితుడు 2019 కాలం నుండి 2024 వరకు విడతల వారీగా దాదాపు 24.53 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు.
ఏళ్లు గడుస్తున్నా కంపెనీ షేర్లు తన పేరు మీద నమోదు కాకపోవడంతో పవన్ కుమార్ గతేడాది యోగానంద్‌ను గట్టిగా నిలదీశారు. ఆ సమయంలో మంజీరా హోటల్స్ అలాగే రిసార్ట్స్ షేర్లు ఇస్తామని యోగానంద్ ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఒప్పందం జరిగిన తర్వాత కూడా షేర్ల బదిలీ ప్రక్రియలో జాప్యం జరగడంతో పవన్ కుమార్ లోతుగా ఆరా తీశారు. ఈ క్రమంలో యోగానంద్ ఆ షేర్లను అప్పటికే టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టినట్లు అసలు విషయం బయటపడింది. తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిపై కేసు నమోదైంది.

