కలం, కరీంనగర్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం (Sayini Mallesham) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కిసాన్ నగర్ గాంధీ విగ్రహం నుంచి చింతల వరకు ఇది కొనసాగింది. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. బీజేపీకి కిసాన్ నగర్‌తో విడదీయరాని అనుబంధం ఉందని, పార్టీ ఏ కార్యక్రమమైనా ఈ గడ్డ నుంచే ప్రారంభిస్తుందని తెలిపారు. కిసాన్ నగర్ అంటేనే బండి సంజయ్ అడ్డా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. బండి సంజయ్ కేంద్రం నుంచి అమృత్, స్మార్ట్ సిటీ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మూడేళ్లుగా నియోజకవర్గాన్ని విస్మరించి, ఇప్పుడు మళ్లీ నాటకాలాడుతున్నారని విమర్శించారు. ఐటీ టవర్, మానేరు రివర్ ఫ్రంట్ పేరిట ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. పార్టీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

