డీఈ ఫిర్యాదు.. రైతుల‌పై నాన్ బెయిల‌బుల్ కేసులు

క‌లం, జోగులాంబ గద్వాల: సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు ఆందోళన బాట పట్టిన జూరాల (Jurala) ఆయకట్టు రైతులపై అమరచింత (Amarchintha ) పోలీస్ స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ​గత నెల 19న జూరాల ప్రాజెక్టు వద్ద ఎడమ కాలువ ఆయకట్టు రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పంటలు ఎండిపోతున్నందున వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడంతో, కోపోద్రిక్తులైన రైతులు ఎడమ కాలువ గేట్ల తాళాలు పగులగొట్టి నీటిని విడుదల చేసుకున్నారు.

​ఈ ఘటనపై జూరాల ప్రాజెక్టు ఇరిగేషన్ డీఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమరచింత పోలీసులు పలువురు రైతులు, స్థానిక నాయకులపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన‌ వారిలో కృష్ణారెడ్డి, రాజు, కురుమూర్తి, గోపి, జబ్బర్, షరీఫ్, శేఖర్ రెడ్డి, దేవేందర్, సమరసింహ, సద్దల భాను‌, వేణు, భాస్కర్ ఉన్నారు. ఇంకా‌ మరికొందరిపై కేసులు నమోద‌య్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసుల న‌మోదు విష‌యాన్ని పోలీసులు గోప్యంగా ఉంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, మీడియాకు కూడా తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ప్రస్తుతం కొందరు రైతులతో పాటు నాయకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల‌పైనా కేసులు..

జూరాల ప్రాజెక్టు కుడి కాలువ రైతాంగానికి సాగు నీరు విడుదల చేయాలని‌ డిమాండ్ చేస్తూ గత నెల‌ 21న గద్వాల పట్టణ పరిధిలోని కలెక్టరేట్, జమ్మిచేడు వద్ద బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేపట్టిన ధర్నా నేపథ్యంలో గద్వాల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ఈ ధర్నా నేపథ్యంలో రోడ్డు బ్లాక్ కావడంతో ప్రజా రవాణా స్తంభించడంతో పలు సెక్షన్ల‌ కింద ఇరు పార్టీలకు చెందిన 12 మందిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>