కలం, వెబ్ డెస్క్: బీహార్ (Bihar)లోని బక్సర్ జిల్లాలో జరిగిన ఓ వివాహ (Marriage) వేడుక తీవ్ర విషాదంగా మారింది. తన ప్రియురాలు మరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న కోపంతో ఓ యువకుడు పెళ్లి మండపంలోనే ఆమెపై కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వధువు కుమారి ఆర్తి (18), వరుడు అవినాశ్ (23) ఇద్దరూ దండలు మార్చుకుని వేదికపై ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు దీనబంధు (22) ఆర్తిని ప్రేమించినట్లు తెలుస్తోంది. ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడం ఇష్టం లేక ఈ దారుణానికి ఒడిగట్టాడు.
వేడుక జరుగుతుండగా హఠాత్తుగా తుపాకీ శబ్దం వినిపించింది. మొదట ఆ శబ్దాన్ని విన్న బంధువులు బాణసంచా కాల్చుతున్నారని భావించారు. కానీ, ఆర్తి పొట్టలో బుల్లెట్ దిగడంతో ఆమె కుప్పకూలిపోయింది. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు భయాందోళనతో పరుగులు తీశారు. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు దీనబంధు అక్కడి నుండి పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన ఆర్తిని చూసి వరుడు అవినాశ్ వెంటనే ఆమెను ఎత్తుకుని ఆసుపత్రికి పరుగులు తీశాడు. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం వారణాసికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిందితుడు దీనబంధుపై గతంలోనే (2021లో) మద్యం అక్రమ రవాణా కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

