కలం, వెబ్‌డెస్క్ : వరకట్నం (Dowry) అనేది భారతదేశంలో శతాబ్ధాలుగా వస్తున్న ఆచారం… కాదు కాదు దురాచారం. ఈ పద్దతి వివాహ వ్యవస్థలో అదనంగా చేరి.. ఓ రుగ్మతగా మారిపోయింది. పెళ్లంటే కట్నం.. అనే రీతిలో మనదేశ ప్రజలు ఈ దురాచారాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఆధునిక యుగంలో కూడా కట్నం అనే పేరుతో మహిళలను హింసిస్తూనే ఉన్నారు. ఈ వరకట్న భూతానికి ఎంతో మంది నవవధువులు బలిపశువులుగా మారుతున్నారు.
ఇద్దరు మనుషులు, రెండు మనసులు కలయికతో జరగాల్సిన వివాహానికి కట్నం అడ్డంకిగా మారుతోంది. లక్షలు, కోట్లు, ఆస్తులు అంటూ అనేక రూపాల్లో వరకట్నం తీసుకుంటున్నారు. వరకట్నం ఇచ్చినా, తీసుకున్నా చట్టప్రకారం నేరం. అయినా కొందరు ఈ తీరు మార్చుకోవడం లేదు. సుప్రీం కోర్టు కూడా కట్నం అనే అంశంపై చాలాసార్లు స్పందించింది. పవిత్రమైన వివాహ వ్యవస్థ కట్నాలతో కమర్షియల్ గా మారిందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ దురాచారానికి వ్యతిరేకంగా అనేక సామాజిక సంస్థలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. అవగాహన కల్పిస్తున్నా కట్నం ఇవ్వడం, తీసుకోవడం కొనసాగుతూనే ఉంది. కానీ, బీహార్ లోని ఓ గ్రామం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. పశ్చిమ చంపారన్ జిల్లాలో విస్తరించి ఉన్న థారూ అనే గిరిజన తెగ వరకట్న (Dowry) పిశాచులకు కనువిప్పు కలిగిస్తోంది. వీరి ఆచారం ప్రకారం వరకట్నం తీసుకున్నా, ఇచ్చినా గ్రామ బహిష్కరణను శిక్షగా విధిస్తారు.
రెండు హృదయాలతో పాటు రెండు కుటుంబాలకు వివాహం అనే కార్యక్రమం పవిత్ర బంధాన్ని ఏర్పరుస్తుందని నమ్ముతారు. పెళ్లిని చాలా గౌరవంగా భావించే ఈ థారు తెగ.. వివాహాన్ని ఎలాంటి ఆడంబరాలు లేకుండా జరిపిస్తారు. ఇది శతాబ్ధాలుగా వారి ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. చదువు లేకున్నా.. ఆధునిక సమాజానికి దూరంగా ఉన్నా.. ఈ థారు తెగ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
Read Also: ఆహా ఏమి రుచి.. పుతిన్ మెచ్చిన భారతీయ వంటకాలివే!
Follow Us On: X(Twitter)


