కలం, స్పోర్ట్స్ : భారత మహిళా బ్యాడ్మింటన్‌లో సరికొత్త విప్లవం మొదలైంది. రెండు వారాల్లో రెండు అంతర్జాతీయ టైటిళ్లను గెలుచుకుని భారత యువ షట్లర్లు దుమ్మురేపారు. గత వారం 17 ఏళ్ల తన్వి శర్మ (Tanvi Sharma) తైపీ ఓపెన్ విజేతగా నిలిచింది. సరిగ్గా ఏడు రోజుల తర్వాత 26 ఏళ్ల అశ్మిత చలిహా (Asmita Chaliha) గాయం నుంచి కోలుకుని కొరియా మాస్టర్స్ టైటిల్ కొల్లగొట్టింది.
గతంలో పీవీ సింధుకు ఒలింపిక్ మెడల్ అందించిన కోచ్ పార్క్ తే-సాంగ్, ఇప్పుడు గువాహాటీలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కొత్త తరాన్ని తయారు చేస్తున్నారు. ఈ వరుస విజయాలు తన నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలమని, నూతన తరాన్ని సృష్టించాలనే లక్ష్యం నెరవేరుతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఈ విజయాలు కేవలం ఆరంభం మాత్రమేనని పార్క్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మే 1 నుంచి ప్రారంభమయ్యే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ రేస్ తమ అసలు లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో 500, 750, 1000 లెవెల్ టోర్నమెంట్లలో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవాలంటే ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి అన్ సే-యంగ్ లాంటి శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని పార్క్ చెప్పారు.
ఆటగాళ్లు ఒత్తిడికి గురైనప్పుడు ‘ఆరామ్‌సే’ అని చెబుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన్వి, అశ్మితలతో పాటు దేవిక సిహాగ్, ఉన్నతి హుడా వంటి క్రీడాకారులు ఒకరినొకరు పోటీపడుతూ ముందుకు సాగుతున్నారు. భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉందని, ఆటగాళ్లకు పూర్తి సహకారం అందిస్తున్న భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (BAI)కు కోచ్ పార్క్ కృతజ్ఞతలు తెలిపారు.

