కలం, మిర్యాలగూడ: దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS) వేదికగా నల్లగొండ జిల్లా రాజకీయం తీవ్రస్థాయిలో వేడెక్కింది. బీఆర్ఎస్ నేతల పర్యటన, వారి ఆరోపణలపై మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘాటుగా స్పందించారు. ప్లాంట్ ఆవరణ సమీపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకత్వ వైఖరిని, గత పాలనా తీరును తీవ్రస్థాయిలో నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో బినామీ కాంట్రాక్టులు, కమీషన్ల పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఎమ్మెల్యే బీఎల్ఆర్ ఆరోపించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు కేటీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారితే.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావులకు ఏటీఎంలా మారింది’ అని ధ్వజమెత్తారు.
స్థానికంగా బొగ్గు లభ్యత లేని ప్రాంతంలో కేవలం కాంట్రాక్టుల్లో కమీషన్లు దండుకోవడానికే ఈ ప్లాంట్‌ను నిర్మించారని, సుదూర ప్రాంతాల నుంచి బొగ్గును రవాణా చేయడం వల్ల నేడు ప్లాంట్‌పై, రాష్ట్ర ఖజానాపై అదనపు ఆర్థిక భారం పడుతోందని మండిపడ్డారు. పవర్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన స్థానిక భూనిర్వాసితులను గత ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని లక్ష్మారెడ్డి విమర్శించారు. నిర్వాసితుల హక్కులు, ప్రయోజనాలను పక్కనపెట్టి, బీఆర్ఎస్ నాయకులు తమ సొంత కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఆరోపించారు. “గతంలో ప్లాంట్ నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడి, భూ నిర్వాసితుల పొట్టకొట్టిన నాయకులు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పవర్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు?” అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలోనే ప్లాంట్ పూర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా యాదాద్రి ప్లాంట్ పనులను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే తెలిపారు. నిర్మాణంలో ఉన్న నాలుగు యూనిట్లను త్వరలోనే పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు, ఐదో యూనిట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు. ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన స్థానిక నిర్వాసితులకు ప్రభుత్వం తరఫున పూర్తి అండగా ఉంటామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చేలా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎవరికీ భయపడేది లేదని, గతంలో జరిగిన అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.

