పోచంపల్లికి ప్రపంచ స్థాయి గుర్తింపు: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

కలం, భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి (Bhoodan Pochampally) చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు పట్టణ కేంద్రంలో ఉన్న తెలంగాణ ఉద్యమ ప్రముఖుడు, పద్మశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

కొలువుదీరిన కొత్త పాలకవర్గం..

అనంతరం జరిగిన సభలో పోచంపల్లి చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా భారత లవకుమార్‌, పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ మాట్లాడుతూ.. పోచంపల్లి ఇక్కత్ చేనేతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, విలక్షణమైన ఖ్యాతి ఉందన్నారు.

ఈ చారిత్రాత్మక కళను, ఖ్యాతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి, అధునాతన మార్కెటింగ్ సౌకర్యాల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తుందని భరోసా ఇచ్చారు.

తెలంగాణ సంస్కృతికి చేనేత ప్రతీక..

చేనేత రంగం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ ప్రతీక అని ఎమ్మెల్యే కుంభం అనిల్ పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం అంకితభావంతో పనిచేస్తూ, సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.

పోచంపల్లి చేనేత వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కుంభం అనిల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి పట్టణ, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మిక సంఘాల నేతలు, పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>