ఎల్‌నినో‌ని సమర్థవంతంగా ఎదుర్కోందాం: మంత్రి దామోదర రాజనరసింహ

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఎల్‌నినో‌ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణకు నాంది కావాలని, ప్రభుత్వ యంత్రాంగం మిషన్ మోడ్‌లో పనిచేయాలని మంత్రి దామోదర రాజనరసింహ (Damodar Raja Narasimha) అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజల ప్రయోజనాల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేసి, వాటి ప్రభావాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు సమష్టి బాధ్యతతో పనిచేసి తెలంగాణకు మార్గదర్శకంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఎల్‌నినో‌ ప్రభావాన్ని ప్రజలపై పడనీయొద్దని, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పశుసంవర్ధకం సహా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జూలై 31 నాటికి శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతిశాఖ ప్రణాళికతో పనిచేస్తేనే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా తగ్గించగలమన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా నది జలాలపైనే ఆధారపడి ఉన్నాయని, కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నిండిన తర్వాతే దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం వచ్చే పరిస్థితి ఉంటుందని అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి స్పందిస్తూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగిస్తూ తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

ప్రజలకు ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పనిచేయని హ్యాండ్‌పంపులు, బోర్లను వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. భూగర్భ జలాల మట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా ఉపాధి హామీ పథకం పనులు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి (Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు.

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. తాగునీటి కొరత కారణంగా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర వైద్య సామగ్రి అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధుల నివారణకు క్లోరినేషన్, ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించినట్లే, ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూలై 31 నాటికి అన్ని శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలు, అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 5 జిల్లాలకు సంబంధించి ఈ నెల 24 న జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 శాతం మేర మాత్రమే పంటల విత్తనాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 50 శాతం విస్తీర్ణంలో సాగు ప్రారంభం కాలేదన్నారు. వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ షఫీ ఉల్లా, ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్ నగర్), జి మధుసూధన్ రెడ్డి (దేవరకద్ర), జె అనిరుధ్ రెడ్డి (జడ్చర్ల), కూచుకుళ్ళ రాజేశ్ రెడ్డి (నాగర్ కర్నూల్), తూడి మేఘా రెడ్డి (వనపర్తి), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల), కసిరెడ్డి నారాయణ రెడ్డి (కల్వకుర్తి), చిక్కుడు వంశీకృష్ణ (అచ్చంపేట) వీర్లపల్లి శంకర్(షాద్ నగర్), విజయుడు (ఆలంపూర్) ఇతర ప్రజాప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లు, మహబూబ్ మేయర్ జి.మమత పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>