సింగరేణిని ప్రైవేటుపరం కానివ్వం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

​కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణకు మకుటాయమానమైన సింగరేణి (Singareni) సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమని, ప్రభుత్వ రంగంగా ఆ సంస్థను మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka ) స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే రూ.1.20 కోట్ల భారీ ఇన్సూరెన్స్ అందేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, కరెంట్ కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు 108 తరహాలోనే ‘పవర్ అంబులెన్స్’ అస్త్రాన్ని అందుబాటులోకి తెచ్చామని ఆయన ప్రకటించారు.

ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క .. ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లిలో మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందించడంతో పాటు గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచేలా సరికొత్త పథకాలతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.

బీఆర్ఎస్ హయాంలో సింగరేణి నిర్లక్ష్యం

​సింగరేణి సంస్థను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) ధ్వజమెత్తారు. ఉన్న బొగ్గు గనులు ఖాళీ అవుతున్నా, కొత్త గని ఆపరేషన్‌లోకి రావడానికి ఐదారు ఏళ్లు పడుతుందని తెలిసి కూడా, గత పాలకులు కొత్త బ్లాకుల వేలంలో పాల్గొనకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం వల్లే సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని, సింగరేణి ఇప్పుడు ఇబ్బందుల్లో పడిందని విమర్శించారు. అయితే, కార్మికుల అకుంఠిత శ్రమ దీక్ష వల్లే సంస్థ బలంగా నిలబడిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫైళ్లన్నీ బయటకు తీసి సింగరేణి హక్కుల కోసం కేంద్రంతో పోరాడామని చెప్పారు.

యూపీఏ ప్రభుత్వం 2013లోనే ‘తాడిచర్ల 2’ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిన కూడా గత ప్రభుత్వం పక్కన పడేసిందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం లీజ్ ఇవ్వకుండా అడ్డుపడిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము కేంద్రంతో పోరాడి ఆ బ్లాక్‌ను సాధించామని, అలాగే ఒడిశాలో ఉన్న “నైనీ” బ్లాక్ పర్మిషన్ల కోసం తానే పర్సనల్‌గా వెళ్లి ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్‌లు పూర్తి చేయించానని వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని బొగ్గు గనులను 1/70 చట్టం ప్రకారం గిరిజనులు, ప్రభుత్వ రంగ సంస్థలే చేపట్టాలని.. ప్రైవేట్ వేలానికి వ్యతిరేకంగా కేంద్రంతో ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.

నిర్వాసితులకు న్యాయం చేస్తాం..

అలాగే, సింగరేణిలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మానవతా కోణంలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ​సింగరేణిలో జీవనం సాగిస్తున్న 45 వేల మంది పర్మనెంట్, 35 వేల మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి (Bhatti Vikramarka) తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సింగరేణి కార్మికులకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే రూ.1 కోటి ఇన్సూరెన్స్ పథకాన్ని తెచ్చామని, అనంతరం దీన్ని విద్యుత్ రంగ సంస్థలైన SPDCL, NPDCL, GENCO, TRANSCO లకూ వర్తింపజేశామన్నారు. ప్రస్తుతం ఈ రక్షణను మరింత పెంచి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీనిని వర్తింపజేస్తూ రూ.1.20 కోట్ల చారిత్రాత్మక ఇన్సూరెన్స్ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు.

గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు పోడు భూముల పట్టాలు పొందిన గిరిజన రైతులు తమ భూముల్లో పసిడి పంటలు పండించుకునేందుకు ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద వ్యవసాయ అభివృద్ధి కోసం ఉచితంగా సౌర విద్యుత్ అందించడంతో పాటు బోర్ బావులు, పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలను సైతం ప్రభుత్వమే పూర్తిగా ఏర్పాటు చేస్తుందని వివరించారు.

​ప్రస్తుతం వర్షాకాలం (జూలై) అయినప్పటికీ వాతావరణంలో వచ్చిన అసాధారణ మార్పుల వల్ల విద్యుత్ వాడకం ఊహించని విధంగా పెరిగిందని భట్టి తెలిపారు. సాధారణంగా ఈ సీజన్‌లో 11,000 మెగావాట్లు ఉండాల్సిన పీక్ డిమాండ్, కేవలం ఒక్క వారం రోజుల్లోనే సడన్‌గా 50 శాతం పెరిగి 16,600 మెగావాట్లకు చేరిందని, మిడ్ సమ్మర్‌ను తలపించేలా ఈ డిమాండ్ ఉండటం చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. డిమాండ్ ఎంత పెరిగినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24 గంటలు పనిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

గతంలో కరెంట్ సమస్యల కోసం సబ్‌స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ అవసరం లేకుండా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖలో ‘పవర్ అంబులెన్స్’ వ్యవస్థను తీసుకొచ్చామని, 1912 కి ఫోన్ చేయగానే.. ట్రాన్స్‌ఫార్మర్, వైర్లు, కట్టర్లు, నిచ్చెన వంటి సామాగ్రి, ఇంజనీర్లు, సిబ్బందితో కూడిన అంబులెన్స్ క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు పూర్తి చేస్తుందని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 165 పవర్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

​ఇదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలవరం కలిగిస్తున్న ఎల్ నినో వాతావరణ ప్రభావం తెలంగాణపై కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల మనుషులకే కాకుండా, అడవుల్లోని వన్యప్రాణులకు తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ ముప్పుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మీడియా, బాధ్యతాయుత పౌరులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మాలోత్ రాందాస్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Read Also: 2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్​ బాబు కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>