కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ బరితెగించి మాట్లాడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన రైతు భరోసా నిధుల విడుదల సభలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ అప్పు చేసి ఉండకపోతే రైతులకు ఇంకా మేలు జరిగేదని అన్నారు. అబద్ధాలతో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు రోడ్లమీద తిరుగుతున్నారని దుయ్యబట్టారు.
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఖర్చు చేసింది రూ.రెండు లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు. కానీ తమ ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.లక్షన్నర కోట్లను రైతుల కోసం ఖర్చు చేశామని తెలిపారు. కేసీఆర్ పదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని భట్టి మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పులకే అసలు, వడ్డీ కింద రెండున్నరేళ్లలో రూ.2.08 లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని విమర్శించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడీ చేయడమే కాకుండా ఇప్పుడు కేటీఆర్, హరీశ్ కట్టుకథలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.

