కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వేడుకలకు హాజరైన ప్రభుత్వ విప్‌కు అధికారులు పూల మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతం, వందేమాతరం, తెలంగాణ రాష్ట్ర గీతాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అధికారుల సమష్టి కృషితో నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని తెలిపారు.
జిల్లా అధికారులు, సిబ్బంది మరింత ఉత్సాహంతో పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వ విప్, కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రశంసా పత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను సైతం ప్రశంసా పత్రాలతో అభినందించారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలను తిలకించి, స్టాళ్లను సందర్శించారు. పోలీసుల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా మహిళా సంఘాలకు మంజూరైన రూ.50 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

