రిసీవ్డ్ కాపీల కోసం గంటల తరబడి నిరీక్షణ.. తల్లిదండ్రుల అవస్థలు

కలం, జగిత్యాల : జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలోని పాత ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయం చల్‌గల్ తాత్కాలిక భవనం వద్ద శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాలవాటిక – 1, 2 ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి రిసీవ్డ్ కాపీలు అందజేసేందుకు అధికారులు ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, దరఖాస్తుదారులు బారులు తీరారు. రిసీవ్డ్ కాపీల కోసం వచ్చిన తల్లిదండ్రులు ఎండలో చాలాసేపు వేచి ఉండాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం నీడ, తాగునీరు తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జగిత్యాల డీఎస్పీ సూచనలు :

పరిస్థితిని గమనించిన జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి అక్కడికి చేరుకుని తల్లిదండ్రులు ఎండలో ఎక్కువసేపు వేచి ఉండటం సరికాదని కేంద్రీయ విద్యాలయ అధికారులకు సూచించినట్లు సమాచారం. రిసీవ్డ్ కాపీల కోసం వచ్చిన తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, క్యూలను క్రమబద్ధీకరించాలని ఆయన సూచించారు. అయితే, డీఎస్పీ సూచనలు చేసినప్పటికీ రిసీవ్డ్ కాపీలను అదే విధంగా పంపిణీ చేయడం కొనసాగించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే రిసీవ్డ్ కాపీల కోసం తల్లిదండ్రులను ఇలా గంటల తరబడి వేచి ఉండేలా చేయడం సమంజసం కాదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసి, దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలగకుండా రిసీవ్డ్ కాపీల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>