కలం, ఖమ్మం బ్యూరో : మధిర నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. బుధవారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ రహదారుల విస్తరణ, నిర్మాణంలో భాగంగా సుమారు రూ.17 కోట్ల 48 లక్షల పైగా నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఇందులో భాగంగా చిరునోముల గ్రామం నుంచి వత్సవాయి ఆర్ అండ్ బి రోడ్ వరకు రూ.320 లక్షలతో నిర్మించనున్న బిటి రోడ్డు, బోనకల్ ఆర్ అండ్ బి రోడ్డు నుండి చిరునోముల వరకు రూ.330 లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం పునాది వేశారు. అలాగే ముష్టికుంట గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.73 లక్షలతో సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులతో పాటు, ముష్టికుంట నుండి నాగులవంచ-చొప్పకట్లపాలెం పీఆర్ రోడ్ వరకు రూ.475 లక్షలు, ముష్టికుంట నుండి గార్లపాడు వరకు రూ.550 లక్షల వ్యయంతో చేపట్టనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపనలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రైతులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఆర్ అండ్ బి ఎస్‌ఈ యాకూబ్, పీఆర్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, డిపిఓ రాంబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

