కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న ప్రతి సమస్యను తాము మానవీయ కోణంలోనే చూస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం ఆయన సభలో ప్రసంగించారు. ఉద్యోగులను ఇవ్వాల్సిన మూడు డీఏ బకాయిలను (DA Dues) గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని విమర్శించారు. మిగతా డీఏ బకాయిలు కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు. పదవీ విరమణ ప్రయోజనాలు గత ప్రభుత్వం చెల్లించలేదని చెప్పారు. రిటైర్‌మెంట్ ప్రయోజనాలు చెల్లించలేకే పదవీ విరమణ వయసు పెంచారని.. దానివల్ల తమ ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 40,154 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని దుయ్యబట్టారు. ఉద్యోగులకు కూడా రూ. 4,571 కోట్లు బకాయిలు పెట్టారని విమర్శించారు.
సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఇబ్బందులున్నా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. పెండింగ్ బకాయిల కింద ప్రతి నెలా రూ.700 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. మానవీయ కోణం ఉంది కనుకే ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్పారు. అలాగే ఉద్యోగులకు నగదురహిత ఆరోగ్య కార్డు (Health Card) ఇస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డు గురించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించలేదని విమర్శించారు. ఉద్యోగులకు రూ.కోటీ 20 లక్షల ప్రమాదబీమా తెచ్చామని వివరించారు. పీఆర్‌సీ (PRC) ఇంకా నివేదిక ఇవ్వలేదు.. ఇచ్చాక నిర్ణయం తీసుకుంటామని భట్టి (Bhatti Vikramarka) వివరించారు.
Read Also: పాక్‌లో చమురు సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలు!
Follow Us On: X(Twitter)

