ఈ ఏడాదిలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తాం : భట్టి విక్రమార్క

కలం/ఖమ్మం బ్యూరో : తెలంగాణ గడ్డ మీద పుట్టడం అదృష్టమని ప్రతి పౌరుడూ భావించేలా బడ్జెట్ తీసుకొచ్చామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు తెలిపారు. ఖమ్మం కాంగ్రెస్ భవన్ లో ఆదివారం మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా రాష్ట్రంలో అందరికీ ఇందిరమ్మ జీవిత బీమా పథకం వర్తింప చేస్తామన్నారు. ఈ ఏడాది కొత్తగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 14 వేల బెడ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని.. ఇతర హాస్పిటళ్లలో మరో 12వేల బెడ్లు అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. 17 మెడికల్ కాలేజీలు కూడా ఈ ఏడాది నుంచి ప్రారంభించుకోబోతున్నామని తెలియజేశారు. విద్యార్థులకు వారంలో ఆరు రోజులు బ్రేక్ ఫాస్ట్ లో పౌష్టిక ఆహారం అందిస్తున్నామన్నారు.

ప్రతి సోమవారం క్రమం తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తామని తెలిపారు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). ఈ సంవత్సరం నియోజకవర్గానికి 1000 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పని కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నామని గుర్తు చేశారు. ఏటీసీలో చదువుకునే విద్యార్థులకు రూ.2000 స్కాలర్షిప్ అందించబో తున్నామన్నారు.

ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సుమారు 69 లక్షల మంది రైతులకు రూ.3446.94 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేశారన్నారు. 45 రోజుల్లో మూడు విడతల్లో రైతులందరికీ అకౌంట్లో రైతు భరోసా జమ చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి 13,500 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. గిరిజనుల భూములు సాగులోకి తీసుకువచ్చేందుకు 100% సబ్సిడీతో ఇందిరా సౌర గిరి జల వికాసం అనే పథకం ద్వారా 6.70 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురాబోతున్నామన్నారు. చరిత్రలో మొదటిసారి గోదావరి పుష్కరాలకు 440 కోట్లు కేటాయించామన్నారు. ఇందుకోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేసి పనులు ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>