కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తూ వారి విశ్వాసాన్ని గెలుచుకుంటున్నాయి. విశేషం ఏమిటంటే, ఈ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, నర్సింగ్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆఫీస్ సిబ్బంది, డాక్టర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి తాము పనిచేస్తున్న ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు పొందుతున్నారు, ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రీయింబర్స్‌మెంట్, హెల్త్ కార్డు వంటి సదుపాయాల కోసం ప్రైవేట్ లేదా కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది తమకు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆసుపత్రులపై పూర్తి నమ్మకంతో అక్కడే చికిత్స పొందుతున్నారు.
ఇటీవల పలువురు మహిళా సిబ్బంది తాము పని చేసే ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్లో నర్సింగ్ ఆఫీసర్ మమత సిజేరియన్ ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. వారం క్రితం అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్ తగరం గణేష్ తన భార్యకు నార్మల్ డెలివరీ చేయించారు. ఇల్లందు ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ రజని సిజేరియన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. భద్రాచలం ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ఆశా పర్వీన్ కి అదే ఆసుపత్రిలో సుఖప్రసవం జరిగింది.
భద్రాచలం నర్సింగ్ సూపరింటెండెంట్ యశోద కుమారికి ప్రసవం తర్వాత శిశువుకు ఏడుపు రాకపోతే, కొన ఊపిరితో ఉన్న శిశువును పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స చేసి ఊపిరి పోశారు. ప్రసవాలే కాకుండా, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కంటి ఆపరేషన్లు, ఎముకల ఆపరేషన్లు, గర్భసంచి ఆపరేషన్లు కూడా తమ పని చేసే ఆసుపత్రుల్లోనే చేయించుకుంటున్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు ప్రకారం, ఈ సంఘటనలు ఆసుపత్రుల నాణ్యత, వైద్య ప్రమాణాలు గణనీయంగా పెరిగిన విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో 24 గంటల వైద్య సేవలు, ఉచిత రక్త పరీక్షలు, టీఫా స్కానింగ్, ఏసీ వార్డులు, పరిశుభ్రమైన వాతావరణం, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, రోగులకు అనుకూలమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచడం వల్లే స్థానికంగా చికిత్స పొందడానికి ఆసుపత్రి ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు అని ఆయన తెలిపారు.

