భువనగిరిలో బెల్లి లలిత విగ్రహ ప్రతిష్ఠాపనకు అడుగులు..

కలం, యాదాద్రి భువనగిరి : తెలంగాణ పోరాట చరిత్రలో తన గళంతో విప్లవ కెరటాలు ఎగిసిపడేలా చేసిన బెల్లి లలిత విగ్రహాన్ని భువనగిరి (Bhuvanagiri)లో ప్రతిష్టించేందుకు ముందడుగు పడింది. ఆదివారం భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలోని ఎస్వీ హోటల్‌లో ఆమె కుమారుడు సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా, ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన లలిత విగ్రహాన్ని ఇంకా ఏర్పాటు చేసుకోలేకపోవడం పట్ల సమావేశంలో పాల్గొన్న ఉద్యమకారులు, అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా లలిత ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపాలని ఈ సందర్భంగా తీర్మానించారు. విగ్రహ ప్రతిష్ఠాపన ప్రక్రియను వేగవంతం చేసేందుకు మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.

ఆకట్టుకునే రీతిలో విగ్రహ రూపకల్పన బాధ్యత.. అందరికీ అందుబాటులో ఉండేలా సరైన స్థలాన్ని అన్వేషించడం.. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన నిధులు, వనరులను సమకూర్చడం.. వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి సమన్వయకర్తలుగా బెల్లి లలిత కుమారుడు సూర్యప్రకాశ్, జన్ని వెన్నెల వ్యవహరించనున్నారు. విగ్రహంతో పాటు బెల్లి లలిత వీరోచిత పోరాట చరిత్రను, ఆమె జీవిత విశేషాలను భవిష్యత్తు తరాలకు అందించేలా ఒక సమగ్రమైన పుస్తకాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను, రచనల రూపంలో పంపాలని అభిమానులను, తోటి ఉద్యమకారులను కమిటీ కోరింది. సన్నాహక సమావేశంలో భట్టు రామచంద్రయ్య, సామ మల్లారెడ్డి, తంగెళ్లపల్లి రవికుమార్, పూస శ్రీనివాస్, భువనగిరి శ్రీనివాస్ నేత, శ్రీనివాసా చార్యులు, దయ్యాల రామనర్సయ్య, ఏశాల అశోక్, పుట్ట వీరేష్ యాదవ్, ఎల్లముల జంగయ్య, పాశపాక మహేశ్, ఆరుముళ్ల రమేష్, శ్రీరాం మురళికృష్ణ, చిలుకల రమేష్, ఊదరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>