కలం, స్పోర్ట్స్: ప్రపంచకప్ (T20 World Cup) గెలిచిన టీమిండియాపై బీసీసీఐ (BCCI) కాసుల వర్షం కురిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సేనకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు రూ. 131 కోట్ల నగదు బహుమతి ఇస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. భారత క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద బహుమతి. బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా మంగళవారం ఈ అధికారిక ప్రకటన చేశారు.
గత ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. టోర్నీ చరిత్రలో టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఏకైక జట్టుగా చరిత్రలో నిలిచింది.
ఈ అద్భుత విజయానికి గానూ ఆటగాళ్లు, సిబ్బంది, సెలెక్టర్లను బోర్డు అభినందించింది. గతంలో రోహిత్ శర్మ జట్టుకు రూ. 125 కోట్లు ప్రకటించారు. ఈసారి ఆ మొత్తాన్ని మరో రూ. 6 కోట్లు పెంచారు. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలకు రూ. 58 కోట్లు ఇచ్చారు. మహిళల జట్టుకు రూ. 51 కోట్లు అందించినట్లు బోర్డు గుర్తు చేసింది.
ఐసీసీ (ICC) నుంచి కూడా భారత్‌కు భారీగా నగదు అందింది. విజేత టీమిండియాకు రూ. 21.5 కోట్లు దక్కాయి. రన్నరప్ న్యూజిలాండ్‌కు సుమారు రూ. 10.75 కోట్లు అందాయి. భారత జట్టు సాధించిన ఈ ఘనతపై బోర్డు (BCCI) హర్షం వ్యక్తం చేసింది. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు సాధించాలని బోర్డు ఆకాంక్షించింది.
Read Also: జడ్జినే భయపెట్టారు: డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ దోపిడీ!
Follow Us On : WhatsApp

