కలం, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli ), పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) జట్టులోకి తిరిగి రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్‌గా కొనసాగుతుండగా, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్ 2026 (IPL 2026) లో హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన కోహ్లీ అఫ్గానిస్తాన్ సిరీస్‌కు దూరమైనప్పటికీ, ఇప్పుడు జట్టులోకి వచ్చాడు. అయితే అతడి ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది.
వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా అఫ్గాన్ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా కూడా తిరిగి జట్టులో చేరాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో భారత పేస్ దాడికి అతడే నాయకత్వం వహించనున్నాడు. అయితే అఫ్గానిస్తాన్‌పై చివరి వన్డేలో సెంచరీతో మెరిసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు గత సిరీస్‌లో ఆకట్టుకున్న ఎడమచేతి పేసర్ గుర్నూర్ బ్రార్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం గాయం కారణంగా మరోసారి జట్టుకు దూరమయ్యాడు. అదే సమయంలో ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయంతో తప్పుకున్నాడు. ఐపీఎల్లో ఎడమ పాదానికి గాయమైన అతడు ప్రస్తుతం పునరావాస దశలో ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. జూలై 14 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో ఎడ్జ్‌బాస్టన్, సోఫియా గార్డెన్స్, లార్డ్స్ వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి.

