కలం డెస్క్ : మావోయిస్టు పార్టీని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ (Operation Kagar) తుది దశకు చేరుకున్నది. ఇప్పటివరకు 11 మంది కేంద్ర కమిటీ సభ్యుల్ని అంతమొందించిన వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలు ఐదుగురిని సరెండర్ బాట పట్టించాయి. ఇక మిగిలింది ఐదుగురు మాత్రమేనని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఒడిషాలో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేశ్ ఉయికె అలియాస్ పాక హన్మంతు మృతితో ఇక ఆ పార్టీలో ఐదుగురు నేతలు మాత్రమే ఉన్నారని అన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు, దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న అలియాస్ సంగ్రామ్, మిశిర్ బెస్రా అలియాస్ భాస్కర్ అలియాస్ సునీల్ అలియాస్ వివేక్, కేంద్రకమిటీ సభ్యుడు అనల్‌దా అలియాస్ తుఫాన్ అలియాస్ ప్రతిరామ్ మాంఝీ అలియాస్ మరాండి మాత్రమేనని వివరించారు.
మూడు నెలల్లో మావోయిస్టు పార్టీ క్లోజ్ :
ఆపరేషన్ కగార్ (Operation Kagar) టార్గెట్ దాదాపుగా రీచ్ అయ్యామని, మరో మూడు నెలల్లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఐజీ సుందర్‌రాజ్ కామెంట్ చేశారు. పార్టీని లీడ్ చేసే అగ్ర నేతల్లో సగం మంది ఎన్‌కౌంటర్లలో చనిపోతే మరికొందరు పోలీసులకు ఆయుధాలతో సహా లొంగిపోయారని, ఇంకొందరు అజ్ఞాతంలోనే ఉన్నారని అన్నారు. కేవలం ఐదుగురు లీడర్లు మాత్రమే పార్టీతో కొనసాగుతున్నారని, వారిని కూడా ఏరివేస్తామన్నారు. దండకారణ్య కమిటీలో బర్స దేవా, పాపారావు మాత్రమే మిగిలారని, హిడ్మా సహా చాలా మంది అగ్రనేతలు హతమయ్యారని అన్నారు. ఆ ఇద్దరిని కూడా తొందర్లోనే తుదముట్టిస్తామని, లక్ష్యం పూర్తవుతుందన్నారు. ప్రాణాలు కోల్పోకుండా ఆ ఇద్దరూ ఆయుధాలతో సహా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు. ఆ డైరెక్షన్‌లో కూడా తమ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఏడాదిలోపే 11 మంది హతం :
“మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ/పోలిట్‌బ్యూరోలో మొత్తం 21 మంది కీలక నేతలను మేం గుర్తించాం… అందులో 11 మంది వేర్వేరు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు.. పార్టీ జనరల్ సెక్రటరీ బసవరాజ్ (నంబళ్ళ కేశవరావు) మొదలు సుధాకర్ (నర్సింహాచలం), మోడెం బాలకృష్ణ (మనోజ్), చలపతి (ప్రతాపరెడ్డి), కాతా రామచంద్రారెడ్డి (రాజు దాదా), కడారి సత్యనారాయణరెడ్డి (కోస దాదా), వివేక్ మాంఝీ, సహదేవ్ సోరేన్ (పర్వేశ్), మడావి హిడ్మా, గాజర్ల రవి (గణేశ్), ఉయికె గణేశ్ (పాక హన్మంతు) చనిపోయారని తెలిపారు. వీరు కాక వివిధ రాష్ట్ర కమిటీ పార్టీ సభ్యులు, స్పెషల్ జోన్ కమిటీ సభ్యుల్లో కొందరు చనిపోయారు. కేంద్ర కమిటీ సభ్యులు లేదా పోలిట్‌బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ (సోను), తక్కెళ్ళపల్లి వాసుదేవరావు (ఆశన్న), పుల్లూరి ప్రసాదరావు (చంద్రన్న), రామ్‌దర్ మజ్జి (సోమా), పోతుల పద్మావతి (సుజాత) సహా పలు రాష్ట్రాల కమిటీల సభ్యులు, వివిధ స్థాయిల్లోని నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Read Also: షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ నేత పోటీ
Follow Us On: Youtube


