కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh)లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్‌బరి జిల్లా దౌలత్‌డియా టెర్మినల్ వద్ద బుధవారం సాయంత్రం ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు పద్మా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈద్ సెలవులు ముగించుకొని సుమారు 40 మంది ప్రయాణికులతో ఢాకాకు వెళ్తున్న ఈ బస్సు నౌక ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్‌గార్డ్ సిబ్బంది 6 గంటల పాటు శ్రమించి అర్థరాత్రి తర్వాత బస్సును వెలికితీశారు. బస్సు లోపల 14 మృతదేహాలు లభించగా, అంతకుముందే నలుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 11 మంది ప్రయాణికులు నదిలో నుంచి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. మరి కొందరు నీటిలోనే గల్లంతయ్యారు. మృతుల్లో చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించడమే కాకుండా ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

