ముదురుతున్న హనీ ట్రాప్ వివాదం.. సంచలనంగా బండి కుమారుడి వ్యవహారం

కలం ,కరీంనగర్ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే బ్లాక్ మెయిలింగ్, బెదిరింపుల ఆరోపణలతో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భగీరథ్ తాజాగా పోక్సో కేసు నమోదవడం సంచలనంగా మారింది. తమ 17 ఏళ్ల మైనర్ కుమార్తెకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌజ్ తో పాటు మరో రెండు ప్రాంతాల్లో కూడా అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 r/w 12 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు పలు కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

“మా కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది”

బాలిక తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు ఇప్పుడు మరింత కలకలం రేపుతున్నాయి. బండి సాయి భగీరథ్ ప్రవర్తన కారణంగా తమ కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు. మానసిక ఒత్తిడి, వేధింపుల కారణంగానే తమ కూతురు తీవ్ర ఆవేదనకు గురైందని చెబుతున్నారు. అంతేకాకుండా……… ఇప్పుడు కేసు నుంచి బయటపడేందుకే తమ కుమార్తెపైనే తప్పుడు కేసులు మోపే ప్రయత్నం చేస్తున్నారని బాలిక కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. “బాధితురాలినే నిందితురాలిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది” అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ‘హనీ ట్రాప్’ వాదన

ఇక భగీరథ్ వర్గం మాత్రం పూర్తి భిన్నమైన వాదనను ముందుకు తీసుకొస్తోంది. స్నేహం పేరుతో దగ్గరై తర్వాత పెళ్లి పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపిస్తోంది. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని, ఇప్పటికే ఒత్తిడితో రూ.50 వేల రూపాయలు కూడా ఇచ్చామని చెబుతోంది. అయితే ఈ వాదనలపైనా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగానూ ఇది సెన్సిటివ్ అంశంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు తీవ్రంగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందిస్తున్నాయి. బ్లాక్మెయిలింగ్ ఆరోపణలా..? లేక పోక్సో కేసులో ఉన్న ఆరోపణలే నిజమా..? అన్నది ఇప్పుడు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>