కనులపండువగా కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవం.. పోటెత్తిన భక్తజనం

కలం ,​ మహబూబ్‌నగర్ బ్యూరో : పేదల తిరుపతి కురుమూర్తి (Kurumurthy Swamy) క్షేత్రంలో  బ్రహ్మోత్సవాల లో ప్రధాన ఘట్టమైన ‘ఉద్దాల ఉత్సవం’ సోమవారం కనులపండుగగా, అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. పాలమూరు పల్లెలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారి ఉద్దాలు(పాదుకలు) ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఎటుచూసినా జనసందోహం, మారుమోగే గోవింద నామస్మరణలతో కురుమూర్తి గిరులు పులకించిపోయాయి.

ఉద్దాల ​ఉత్సవంలో భాగంగా ఉదయం 10 గంటలకు చిన్నచింతకుంట మండలం పల్లమర్రి గ్రామంలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం, అత్యంత నియమనిష్టలతో తయారు చేసిన పవిత్రమైన ‘చాట’ను పల్లమర్రి నుంచి భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. భక్తుల కోలాహలం మధ్య చాటను వడ్డేమాన్ గ్రామానికి చేర్చారు.

​వడ్డేమాన్ చేరుకున్న చాటకు గ్రామస్తులు, ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అత్యంత పవిత్రమైన స్వామివారి ఉద్దాలను ఊరేగింపుగా తరలించారు. ఈ యాత్ర ఊకచెట్టు వాగుకు చేరుకోవడంతో అక్కడ మహా తిరునాళ్ల వాతావరణం నెలకొంది. భక్తుల గోవింద నామస్మరణతో ఊకచెట్టు వాగు పరిసరాలు మారుమోగాయి. ఊకచెట్టు వాగులో భక్తుల దర్శనానంతరం, నిర్వాహకులు అత్యంత భక్తిభావంతో చాటను చేతులపై మోసుకుంటూ తిరుమలాపూర్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉద్దాలకు, చాటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి సర్వాంగ సుందరంగా, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన ‘చైతన్య రథం’ (ట్రాక్టర్) పై ఉద్దాలను కొలువుదీర్చి కురుమూర్తి గిరుల వైపుకు తరలించారు.

​శివసత్తుల పూనకాలు.. ఉద్దాల గుండు వద్ద ఆధ్యాత్మిక పారవశ్యం

​ఉద్దాల రథం కురుమూర్తి క్షేత్ర సమీపంలోని పవిత్రమైన ‘ఉద్దాల గుండు’ వద్దకు చేరుకోగానే భక్తి వాతావరణం పతాక స్థాయికి చేరింది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు, పూనకాలతో ఆ ప్రాంతమంతా దైవత్వాన్ని సంతరించుకుంది. ఉద్దాల గుండు వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఉద్దాలను కొండపైకి (మోకాళ్ల పర్వతం మీదుగా) భక్తిశ్రద్ధలతో తరలించారు.

​సంప్రదాయం ప్రకారం ఆలయ ప్రాంగణంలో ముందుగా ఐదు ప్రదక్షిణలు పూర్తి చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి స్వయంగా ఉద్దాలను కురుమూర్తి స్వామివారి ఆలయంలోకి తరలించి ప్రతిష్ఠించారు. దీంతో బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఉద్దాల వేడుక వైభవంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా, ఆలయ కమిటీ భక్తులకు సకల సౌకర్యాలు కల్పించింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>