ఏదుట్లలో రేషన్‌ షాపుపై డీఎస్‌ఓ కొరడా!

కలం, వనపర్తి: గోపాలపేట మండలం ఏదుట్ల (Yedutla) గ్రామంలో రేషన్‌ పంపిణీ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులతో జిల్లా పౌరసరఫరాల అధికారి ఆంజనేయులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో రెండు రేషన్‌ షాపులు ఉన్నప్పటికీ ఏళ్లుగా ఒకే ప్రైవేటు వ్యక్తి ద్వారా బియ్యం పంపిణీ చేయిస్తున్నారన్న ఆరోపణలపై ఆరా తీశారు. గ్రామంలోని 425015 నంబరు షాపు డీలర్‌ శమంతకమ్మ, 425014 నంబరు షాపు డీలర్‌ భారతమ్మ అనారోగ్య కారణాలతో స్వయంగా పంపిణీ చేయకుండా రాములు అనే వ్యక్తికి నెలకు రూ.3,500 చెల్లిస్తూ షాపులు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో డీఎస్‌ఓ రెండు షాపులను తనిఖీ చేశారు. నెలలో 15 రోజులు గడిచినా భారతమ్మ షాపులో బియ్యం పంపిణీ ప్రారంభించకపోవడంపై వివరణ కోరారు. ఆమె ఆరు నెలల సెలవు కోరుతూ దరఖాస్తు ఇచ్చినట్లు తహసీల్దార్‌ తిలక్‌రెడ్డి వివరించారు. ప్రత్యామ్నాయ పంపిణీ ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన డీఎస్‌ఓ భారతమ్మ షాపును సీజ్‌ చేసి ఈపాస్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. షాపులో ఉన్న సుమారు 320 బియ్యం బస్తాల నిల్వలను ఈపాస్‌ రికార్డులతో సరిపోల్చాలని అధికారులను ఆదేశించారు.

రెండు షాపుల్లోనూ స్టాక్‌ బోర్డులపై నిల్వల వివరాలు ప్రదర్శించకపోవడంపై డీలర్లను నిలదీశారు. అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంటే నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాలని, ప్రైవేటు వ్యక్తులతో ఏళ్ల తరబడి షాపులు నిర్వహించడం సరికాదని స్పష్టం చేశారు. తనిఖీల్లో డీటీలు పరమేష్‌, ప్రసాద్‌, విష్ణు, ఆర్‌ఐ ప్రసన్న, జీపీఓ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>