కలం, వెబ్ డెస్క్ : తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. 2025 సంవత్సరంలో తన కూతురికి పరిచయమైన బండి భగీరథ్ మొదట స్నేహితుడిలా వ్యవహరించాడని.. తర్వాత మానసికంగా లోబర్చుకుని డిస్టర్బ్ చేశాడని పేర్కొన్నారు.
గతంలో తన కూతురిపై భగీరథ్ (Bandi Bhagirath) పలుసార్లు లైంగిక దాడులు చేశాడని ఆమె ఆరోపించారు. డిసెంబర్ 31న బలవంతంగా మద్యం తాగించి ఒకసారి, మరోసారి ఒక అపార్ట్‌మెంట్‌లో అఘాయిత్యానికి పాల్పడినట్లు తన కూతురు తెలిపినట్లు వివరించారు. దీంతో చట్టపరంగా పోరాడేందుకు సిద్ధమవుతున్న సమయంలో తన కూతురిపై బ్లాక్ మెయిల్ కేసు నమోదు చేసి కుట్ర చేస్తున్నట్లు గ్రహించామన్నారు. ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు.
ఏప్రిల్ 23న సంగప్ప ద్వారా బండి సంజయ్‌ని కలిసినట్లు బాధితురాలి తల్లి లేఖలో ప్రస్తావించారు. బండి సంజయ్ ను కలిస్తే న్యాయం చేస్తారని అనుకుంటే తమ గురించి దారుణంగా మాట్లాడి బెదిరించి పంపించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫిర్యాదు తీసుకోకుండా నిరాకరించారని ఆమె ఆరోపించారు. తరువాత పోలీసులు చాలా సార్లు వేడుకున్న తర్వాత కేసు నమోదు చేశారని చెప్పారు. అయితే, మొదట బెయిల్ వచ్చేలా సెక్షన్లు పెట్టినా.. కూతురి స్టేట్ మెంట్ రికార్డు చేసిన తరువాత సెక్షన్లు మార్చారని ఆమె ఆరోపించారు.
అలాగే, తన కూతురి ఫోటోలను మీడియాలో కానీ, సోషల్ మీడియాలో పెట్టొద్దని బాధితురాలి తల్లి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పోక్సో కేసులో విచారణ వేగవంతం చేసి తన కూతురికి న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

