ఏం చేశారని కాంగ్రెస్‌కు 90 సీట్లు: బండి సంజయ్

కలం, కరీంనగర్: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు, 1 కోటి ఓట్లు వస్తాయనడం పెద్ద జోక్ అని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. ఏం చేశారని కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు వస్తాయని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. తెలంగాణలో అందరికీ అధికారం ఇచ్చారని.. బీజేపీకి కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.

కాంగ్రేస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రాహుల్ గాంధీ.. సర్ ప్రక్రియతో మీకొచ్చిన నష్టమేంది?’ అంటూ ఘాటుగా స్పందించారు. చనిపోయిన 3 కోట్ల మంది ఓట్లను తొలగిస్తే తప్పేముందని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, పీసీసీ మాజీ చీఫ్ ఎమ్మెస్సార్ చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఓట్లు తొలగించలేదని అన్నారు. 2014కు ముందు అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన 4 కోట్ల మంది ఓట్లను తీసేస్తే తమకు నొప్పి ఎందుకు? అని నిలదీశారు. శాశ్వతంగా వలస వెళ్లిన 6 కోట్ల మంది ఓట్లను తీసేస్తే నష్టమేంటి? అని ప్రశ్నించారు. సుమారు కోటి మంది డూప్లికేట్ ఓట్లను తొలగిస్తే తప్పేముందని అన్నారు.

బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వలస వచ్చిన ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవాలని అనుకుంటుందా? అని బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. డ్రగ్స్ బారిన పడి యువత అల్లాడుతుంటే ప్రధాని మోదీ కంట తడి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నషా ముక్త్ భారత్’ పేరుతో డ్రగ్స్ రహిత సమాజం కోసం కేంద్రం పనిచేస్తోందన్నారు. దేశాభివృద్ధి కోసం పోరాడుతున్న ప్రధాని మోదీకి అండగా నిలవాలని ప్రజలను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>