చర్లలో రాష్ట్రస్థాయి బాలుర వాలీబాల్ పోటీలు ప్రారంభం!

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల (Cherla) మండలం పూజారిగూడెం శివార్లలో 70వ రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో భాగంగా అండర్-17 బాలుర వాలీబాల్ పోటీలు (Volleyball Tournament) సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై, క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్‌లో తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు చెందిన అండర్-17 బాలుర జట్లు తలపడుతున్నాయి.

​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. చర్ల మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల యువతలో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు, సదుపాయాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ నిధుల సహకారంతో పాటు స్థానిక ప్రజలు, కాంట్రాక్టర్ల తోడ్పాటుతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.75 లక్షల వ్యయంతో పూజారిగూడెం శివార్లలో ఈ మైదానాన్ని నిర్మించినట్లు వెల్లడించారు.

ఈ మైదాన నిర్మాణం పూర్తయిన తర్వాత తొలుత సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలను నిర్వహించామని, ఇప్పుడు రాష్ట్రస్థాయి పోటీలకు వేదిక కావడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఈ మైదానం స్థానిక క్రీడాకారుల సాధనకే కాకుండా, పోలీస్ ఉద్యోగాల కోసం శారీరక దారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

​జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత, మారుమూల ఆదివాసీ గ్రామాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ స్పష్టం చేశారు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు సహకారం అందిస్తున్నామని చెప్పారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వానికి దోహదపడతాయని తెలిపారు.

క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని, ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికై జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, చర్ల సీఐ రాజు వర్మ, క్రీడా నిర్వాహకులు, కోచ్‌లు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>