కలం, యాదగిరిగుట్ట : భవనం లేదు.. పునాదులు లేవు.. నిర్మాణ అనుమతులు లేవు.. అయినా ఇంటి నంబర్లు ఎలా వచ్చాయి? ఖాళీ స్థలాలకు నివాస భవనాలుగా గుర్తింపు ఎలా లభించింది? ఒక్కో అసెస్మెంట్కు 300 చదరపు అడుగుల నిర్మాణం ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేసిన వ్యవహారం వెనుక అసలు కథేంటి? యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో (Yadagirigutta Municipality) ఇప్పుడు ఈ ప్రశ్నలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యాదాద్రి పుణ్యక్షేత్రం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ పాలనపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ రికార్డుల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మూడు నంబర్లు.. మున్సిపల్ పాలనకు మూడు ప్రశ్నలు..
13-285/5/A/A/1, 13-285/5/A/A/2, 13-285/5/A/A/3.. ఈ మూడు ఇంటి నంబర్లే ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఎలాంటి భవనాలు, పునాదులు లేని ఖాళీ స్థలాలకు ఈ నంబర్లు కేటాయించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఒక్కో అసెస్మెంట్కు 300 చదరపు అడుగుల నివాస విస్తీర్ణం ఉన్నట్లు రికార్డులు సృష్టించారని, నాలా (NALA), లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులు లేకుండానే ఈ ప్రక్రియ సాగిందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
మేనేజర్ సస్పెండ్.. మరి కమిషనర్ సంగతేంటి?
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఈ నెల 9వ తేదీనే రెవెన్యూ ఆఫీసర్/మేనేజర్ పి. సుమితను సస్పెండ్ చేశామని, మున్సిపల్ కమిషనర్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చామని కలెక్టర్ తెలిపినట్లు బీజేపీ నేత వెల్లడించారు. అయితే ఇన్ని రోజులు ఈ చర్యలను ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు. విచారణలో కమిషనర్ కూడా తప్పిదాన్ని అంగీకరించినట్లు పేర్కొంటూ, కేవలం కింది స్థాయి ఉద్యోగిపై చర్యలతో వ్యవహారాన్ని ముగించవద్దని డిమాండ్ చేశారు. తప్పు జరిగితే బాధ్యత అందరిదీ కాదా? కింది స్థాయి అధికారులపైనే చర్యలు ఎందుకు? పైస్థాయి అధికారుల బాధ్యతను కూడా తేల్చాలి. మున్సిపల్ కమిషనర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి” అని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
స్ట్రీట్లైట్ల కొనుగోళ్లపైనా విచారణ జరగాలి..
మున్సిపాలిటీలో స్ట్రీట్లైట్లను అధిక ధరలకు కొనుగోలు చేశారనే ఆరోపణలపై గతంలోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. కొనుగోళ్లలో ధరల వ్యత్యాసాలు, టెండర్ ప్రక్రియ, బిల్లుల చెల్లింపులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
ఉద్యోగులకు బీజేపీ ఘాటు హెచ్చరిక..
మున్సిపల్ ఉద్యోగులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని ప్రవీణ్ కుమార్ సూచించారు. రాజకీయ నాయకుల పదవీకాలం ఐదేళ్లేనని, ఉద్యోగులు మాత్రం 30 ఏళ్లపాటు సేవలందించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. తాత్కాలిక రాజకీయ ఒత్తిళ్లకు లొంగి తమ ఉద్యోగ జీవితానికి మచ్చ తెచ్చుకోవద్దని హితవు పలికారు.
ఇప్పుడు జిల్లా యంత్రాంగం ముందున్న అసలు పరీక్ష..
ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించినట్లు వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ ఎప్పుడు పూర్తవుతుంది? రికార్డులను రూపొందించినవారు ఎవరు? వాటిని పరిశీలించి ఆమోదించినవారు ఎవరు? స్ట్రీట్లైట్ల కొనుగోళ్లపై వచ్చిన ఆరోపణల సంగతేంటి? కమిషనర్‌పై తదుపరి చర్యలు ఉంటాయా? ఈ ప్రశ్నలకు జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారం ఇప్పుడు పట్టణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
మున్సిపల్ రికార్డుల్లో నిజమెంత? బాధ్యత ఎవరిది? చర్యలు ఎవరిపై? ఈ మూడు ప్రశ్నలకు అధికారిక సమాధానం వచ్చే వరకు యాదగిరిగుట్టలో ఈ వివాదం చర్చనీయాంశంగానే కొనసాగే అవకాశం ఉంది. ఈ మీడియా సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు అశోక్, పట్టణ ప్రధాన కార్యదర్శులు మందోజ్ నరేష్, పలుగుల సురేష్, ఉపాధ్యక్షులు ఆవుల సత్యం, ఆలేటి కరోనా, బోడ సురేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కల్లూరి విజయ్, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు శివరాత్రి శ్రీశైలం, గాదె వంశీ, గుండ్లపల్లి వినోద్, సుధగాని శివ, బోగ అజయ్, సంద ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

