కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే దారిలో బావుపేట వద్ద రోడ్డుపై చిన్నపాటి వర్షానికే వరద పారుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్తుండగా వాహనదారులను ఇబ్బందులను గమనించి, ఆగారు. వాహనం దిగి నీరు నిలిచిన చోటకు వచ్చి స్థానికులతో మాట్లాడారు. అధికారులకు చెబుతున్నా చర్యలు తీసుకోకపోవడం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన బండి సంజయ్ వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి..శాశ్వత పరిష్కారం చూపేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. స్కూళ్లు ప్రారంభమైతే.. విద్యార్థులు ఇబ్బందులు పడుతారని, తాత్కాలికంగా నీరు నిలవకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సిరిసిల్ల పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

