క‌రీంన‌గ‌ర్‌లో హిందూ ఏక్తా యాత్రకు చ‌కచ‌కా ఏర్పాట్లు

కలం, కరీంనగర్ బ్యూరో: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 12న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హిందూ ఏక్తా యాత్ర’ (Hindu Ekta Yatra)కు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. హిందువులందరినీ సంఘటితం చేయడమే లక్ష్యంగా ప్రతి ఏటా బాల గంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే స్పూర్తితో హిందువులందరినీ రాజకీయాలకు అతీతంగా సంఘటితం చేయాలనే లక్ష్యంతో సరిగ్గా 16 ఏళ్ల క్రితం బండి సంజయ్ కుమార్ కరీంనగర్ (Karimnagar) లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా గుప్పెడు మంది నుండి వందలుగా, వేలుగా హిందువులంతా తరలివచ్చి హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు. ప్రతి ఏటా హిందూ ఏక్తా యాత్రకు వచ్చే హిందువుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాది సైతం భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈసారి అంతకు మించి ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

గతంకంటే మిన్నగా…

గతానికి భిన్నంగా ఈసారి ‘హిందూ ఏక్తా యాత్ర’కు రావాలంటూ కాషాయ శ్రేణులు, కార్పొరేటర్లు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కాషాయ శ్రేణులు తమ తమ డివిజన్లలోని, కాలనీల్లోని గోడలపై ‘హిందూ ఏక్తా యాత్ర’కు తరలి రావాలంటూ స్వయంగా వాల్ పెయింటింగ్ రాశారు. సోషల్ మీడియా ద్వారా విస్తృత‌ ప్రచారం నిర్వహిస్తున్నారు.

వేసవిలో ఇబ్బంది లేకుండా….

ఏక్తా యాత్రకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు జనం ఉత్సాహం చూపుతుండటంతో వారికి ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పించేందుకు కాషాయ శ్రేణులు సిద్ధమయ్యాయి. మరోవైపు ఎండాకాలం కావడంతో ఏక్తా యాత్రలో పాల్గొనే వారికి కాషాయ శ్రేణులు, హిందుత్వ వాదులు, వ్యాపారులు స్వచ్ఛందంగా మంచినీళ్లు, మజ్జిగ, ఇతర ఆహార పానీయాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హిందూ ఏక్తా యాత్ర ఆరంభమయ్యేది ఇలా…

కరీంనగర్ లోని వైశ్య భవన్ నుండి 12న సాయంత్రం 4 గంటలకు హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ ఆరంభంలోనే వైశ్యాభవన్ వద్ద హిందుత్వ వాదులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తారు. అనంతరం వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గంజ్, కమాన్ , వన్ టౌన్, వెంకటేశ్వర టెంపుల్, అమరవీరుల స్థూపం, జయశంకర్ సర్కిల్, రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి వైశ్య భవన్ కు చేరుకుంటుంది. ఇక్కడే హిందూ ఏక్తా యాత్రను ముగిస్తారు. ఈ యాత్రకు కులాలను పక్కన పెట్టి హిందువులంతా రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల కార్యకర్తలంతా ఈ యాత్రకు హాజరవుతుండటం విశేషం. ముఖ్యంగా వివిధ కుల సంఘాల నాయకులంతా సంఘీభావం తెలిపారు. వీరితోపాటు వివిధ వృత్తి సంఘాలు, ధార్మిక సంస్థలు, కళాకారులు, కార్మిక సంఘాల నాయకులు ఈ యాత్రలో పాల్గొనబోతోన్నాయి.

ఆకట్టుకోనున్న కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు

దాదాపు 6 గంటలపాటు కొనసాగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనే హిందుత్వ వాదులు, కరీంనగర్ పట్టణ ప్రజలను ఆకట్టుకునేలా వివిధ రూపాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కేరళ నుండి హనుమంతుడు, హైదరాబాద్ నుండి శ్రీరాముడి విగ్రహాలను కరీంనగర్ కు తరలిస్తున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక వేషధారణలతో ఆకట్టుకునే కళాకారులను రప్పిస్తున్నారు. కేరళ నుండి డప్పు వాయిద్య కళాకారులు వస్తున్నారు. ప్రత్యేకంగా సిరిసిల్ల నుండి ప్రతి ఏటా ధ్వజాలు రాబోతున్నాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో అయోమయం నెలకొన్న నేపథ్యంలో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ సందర్భంగా వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ హిందుత్వ వాదుల్లో జోష్ నింపేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిద్ధమయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>