కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న తీరు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల బజారు భాషను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ”నువ్వు కొట్టినట్లు చేయ్… నేను ఏడ్చినట్లు చేస్తా” అంటూ….కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసి కాంప్రమైజ్ పాలిటిక్స్ తో ప్రజలను పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
స్పీకర్ ను దూషించడం తప్పే..
స్పీకర్ ను బీఆర్ఎస్ నేతలు అసభ్య పదజాలంతో దూషించడాన్ని ప్రజాస్వామ్యవాదులెవరూ జీర్ణించుకోలేరని బండి సంజయ్ అన్నారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధుతోపాటు పోలీసులపై చేయి చేసుకున్న బీఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందేనని.. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
మహిళా ఎమ్మెల్యేల పై పోలీసుల తీరు కరెక్ట్ కాదు
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకులు నల్లచొక్కాలు ధరిస్తే అసెంబ్లీలోకి రానివ్వకపోవడం కూడా తప్పేనని కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శించారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నల్లచొక్కా ధరించి పార్లమెంట్ కు రాలేదా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ద నిరసనలను కూడా ప్రభుత్వం అంగీకరించలేక అసహనంతో కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అక్కడో రూల్, ఇక్కడో రూల్ వుంటుందా? అని నిలదీశారు.
ప్రజా సమస్యలపై డైవర్షన్ డ్రామాలాపండి
ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకుపెట్టి రెండ్రోజులపాటు ఒకే అంశంపై చర్చ జరిపి విలువైన సభా సమయాన్ని వృధా చేయడం దుర్మార్గమని బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలపై ఇకనైనా డైవర్షన్ డ్రామాలాపండని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సూచించారు. 22ఏతో జనం అల్లాడుతున్నారని.. మంత్రులు, అధికార పార్టీ నేతల రూ.వేల కోట్ల భూ దందా చేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు రాక, సర్టిఫికెట్లు రాక లక్షల మంది విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సాగు నీరందక దక్షిణ తెలంగాణ రైతాంగం ఆందోళనతో ఉందని.. ఉద్యోగాలు లేక, ఐటీ సంస్థలు, పరిశ్రమలు మూతపడి నిరుద్యోగులు అల్లాడుతున్నారని చెప్పారు. డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు రాక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గగ్గోలు పెడుతున్నారని.. అసెంబ్లీలో వీటిపై చర్చ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.
బీజేపీ కార్యకర్తలపై అమానుష చర్య
ప్రజలు సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాల్సిన శాసనసభను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయాలకు వాడుకుంటున్నాయని బండి సంజయ్ అన్నారు. ఈ క్రమంలోనే ఫీజు రీయంబర్స్ మెంట్ పై ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు రక్తం కారేలా కొట్టారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపైనా, ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు తెలిపే వారిపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయితే అసెంబ్లీ ముందు చేసిన నిరసనల్లో బీఆర్ఎస్ నేతలకు దెబ్బలు తగలక పోయినా ఏదో జరిగినట్లు షో చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వేర్వురు కాదని.. రెండు పార్టీలు కలిసి ప్రజలను దోచుకుతింటున్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలు కనీసం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండే అర్హతను ఎప్పుడో కోల్పోయిందని అన్నారు. అసెంబ్లీకే రాని కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? అని ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫాంహౌజ్ పై దాడి, కేసీఆర్ పై హత్యాయత్నం పెద్ద జోక్ అని అభిప్రాయపడ్డారు. పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసే సంస్కృతిని నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు. ఎర్రవల్లిలోనైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేసీఆర్ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు, దోపిడీ, అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని.. ఇకనైనా డ్రామాలు కట్టి పెట్టాలన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ మాత్రమేనని.. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

