కలం, వెబ్ డెస్క్: ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ను యువ ఫిలిం మేకర్స్ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, సెట్విన్ మాజీ చైర్మన్ గిరిధర్ రెడ్డిలతో కలిసి మంత్రి ఛాలెంజ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
యువత ప్రతిభను ప్రదర్శించాలి..
ఈ సందర్భంగాకోమటిరెడ్డి మాట్లాడుతూ.. షార్ట్‌ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఛాలెంజ్ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. యువ ఫిలిం మేకర్స్, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఛాలెంజ్‌ను విజయవంతం చేయాలని మంత్రి కోరారు.
ఉత్తమ చిత్రానికి రూ. 3 లక్షలు..
ఉత్తమ చిత్రానికి ప్రథమ బహుమతి కింద రూ. 3 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి కింద రూ. లక్ష అందజేయనున్నారు. అలాగే కన్సోలేషన్ బహుమతిగా ఐదుగురికి 20 వేలు ఇవ్వనున్నారు. ఉత్తమ చిత్రాన్ని నిర్మించి సెప్టెంబర్ 15లోపు సమర్పించాల్సి ఉంది. నియమిత గడువులోగా వచ్చేసిన ఎంట్రీలను పరిశీలించి వివిధ కేటగిరీలలో వివిధ విభాగాలకు అర్హులైన చిత్రాలను నిపుణులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుంది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో అక్టోబర్ 18న బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది.

