కలం, నిర్మల్ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిర్మల్ (Nirmal)జిల్లా కేంద్రంలో మంగళవారం ఆశా వర్కర్లను(ASHA workers) పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి. సుజాత తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా అమలు చేయలేదని విమర్శించారు.
అరెస్టులపై ప్రజాసంఘాలు స్పందించాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ 1000 రోజుల పాలనలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టులు చేయడమే సాధించిందా అని ప్రశ్నించారు. ఆశా వర్కర్లపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుగుణ నాయకులు మంజుల, సంగీత, లక్ష్మి, సరస్వతి, పద్మ, రాజమణి తదితరులు పాల్గొన్నారు.

