కలం, వెబ్‌డెస్క్: అస్సాంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Assam Road Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చంది. ఈ ప్రమాదంలో మొదట 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గోలాఘాట్ జిల్లా కజిరంగా సమీపంలోని రోంగాజాన్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యాన్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి అతుల్ బోరా వెల్లడించారు. పలువురు తీవ్రంగా గాయపడగా, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో పలువురు కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు. కాలేజీకి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో విషాదం నెలకొంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

