కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు. శనివారం ఉదయం కరీంనగర్ జిల్లాలోని బీజేపీ (BJP) ప్రజాప్రతినిధులతో పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధిస్తే కొండగట్టు (Kondagattu)కు పాదయాత్రగా వస్తామని మొక్కుకున్నట్లు వెల్లడించారు. ఆ మొక్కు తీర్చుకునేందుకు ప్రజాప్రతినిధులతో కలిసి అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో పాదయాత్రగా వెళ్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆలయం ఎంతో శక్తివంతమైనదని, కోరుకున్న కోర్కెలు తీర్చే దేవుడు ఆ ఆంజనేయస్వామి అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ యాత్రకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా మొదటిసారి గెలిచినప్పుడు కూడా యాత్ర చేసినట్లు తెలిపారు. యాత్రకు మీడియా, పోలీసులు సహకరించాలని కోరారు.
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే అక్కడి నుంచి కొండగట్టుకు నిధులు వచ్చాయని బండి సంజయ్ వెల్లడించారు. తెలంగాణలో కూడా తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని, కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కొండగట్టులో స్వాముల దీక్ష, నీటి సౌకర్యం, గిరి ప్రదిక్షణ, గెస్ట్ హౌస్‌ల విషయంలో గొప్ప ప్లాన్‌తో ముందుకు వస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా కొండగట్టుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు.

