కలం, కరీంనగర్ బ్యూరో : హుస్నాబాద్ నియోజకవర్గంలోని రేకొండ ప్రభుత్వ పాఠశాల (Rekonda School) అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పిలుపునిచ్చారు. రేకొండ గ్రామంలో పర్యటించిన ఆయన, స్థానికులతో కలిసి సద్ది తింటూ ‘టిఫిన్ బైఠక్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. టిఫిన్ తెచ్చుకుని..స్థానికులతో కలిసి తిన్నారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాల పరిశుభ్రత, ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానికులు, ఉపాధ్యాయులతో చర్చించారు.
ఎంపీగా గెలిచినప్పటి నుండి సమాజ సేవకే తాను తొలి ప్రాధాన్యత ఇస్తున్నానని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చర్చల సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి డైనింగ్ సౌకర్యం లేదని, అలాగే ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల కొరత తీవ్రంగా ఉందని వారు వివరించారు.
ఉపాధ్యాయులు, స్థానికుల విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. హైస్కూల్ విద్యార్థుల డైనింగ్ హాల్ నిర్మాణం కోసం రూ.5 లక్షలు, ప్రాథమిక పాఠశాల నూతన తరగతి గదుల నిర్మాణం కోసం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ మొత్తం రూ.25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా తొలి విడత కింద రూ.10 లక్షలను త్వరలోనే అందిస్తామని వెల్లడించారు.
ఇదే క్రమంలో రేకొండ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బండి సంజయ్ అభినందించారు. గతేడాది లాగే ఈసారి కూడా పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానికులను కోరారు. ఇందుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ విజయాల బుక్‌లెట్లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మంత్రి అందజేశారు.

